విద్యా వారోత్సవాల్లో భాగస్వాములు కావాలి | - | Sakshi
Sakshi News home page

విద్యా వారోత్సవాల్లో భాగస్వాములు కావాలి

May 11 2026 8:44 AM | Updated on May 11 2026 8:44 AM

అలంపూర్‌: విద్యా వారోత్సవాల్లో భాగస్వాములు కావాలని విద్యాశాఖ అధికారులు ఎమ్మెల్యేను ఆహ్వానించారు. కర్నూలులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే విజయుడును నియోజకవర్గంలోని మండల విద్యా శాఖ అధికారులు ఆదివారం కలిసి విద్యా వారోత్సవాలకు ఆహ్వానం అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుంచి శనివారం వరకు విద్యా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు, విద్యార్థుల్లో నైపుణ్యాలు వెలికితీయడం, విద్యా వ్యవస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వారోత్సవాలు నిర్వహిస్తుందని చెప్పారు. విద్యా వారోత్సవాల్లో ప్రతిరోజు ఒక ప్రత్యేక అంశంపై విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారులు అశోక్‌కుమార్‌, భగీరథరెడ్డి, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలి

పాన్‌గల్‌: పండుగలు శాంతియుతంగా జరుపుకొంటూ అందరికీ ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. ఆదివారం మండలంలోని మాందాపూర్‌లో వీరభద్రుడి ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలను వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు రోజువారి పనులతో పాటు కొంత సమయం దైవ భక్తికి కేటాయించాలన్నారు. చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుందని.. తమ పిల్లలను బాగా చదివించాలని సూచించారు. అంతకుముందు మంత్రి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. పోటీలకు ఆర్థిక తోడ్పాటునందించిన మంత్రిని ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ గోవర్ధన్‌సాగర్‌, సర్పంచ్‌ సుగుణమ్మ, ఉప సర్పంచ్‌ శ్యాంసుందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు కృష్ణయ్యసాగర్‌, జయరాములుసాగర్‌, కమిటీ సభ్యులు కుపేందర్‌రెడ్డి, పరమేష్‌, మహేష్‌, నర్సింహరాజు, భగవంతు పాల్గొన్నారు.

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు..

ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో ఆర్భాటాలకు పోయి అప్పుల పాలు కావద్దని మంత్రి జూపల్లి లబ్ధిదారులకు సూచించారు. గ్రామంలో సర్పంచ్‌ సుగుణమ్మ ఇంటి గృహ ప్రవేశం చేసి మాట్లాడారు. ప్రభుత్వం అందించే రూ.5 లక్షలతో నిబంధనల మేరకు ఇంటిని నిర్మించుకోవాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పారు.

కొత్త కోర్సుల్లో చేరండి

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాలలో ఇటీవలి తీసుకువచ్చిన కొత్త కోర్సుల్లో విద్యార్థులు చేరాలని కళాశాల ప్రిన్సిపాల్‌ పద్మావతి పేర్కొన్నారు.కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కళాశాలలో ఇటీవల బీకాంలో బీఎఫ్‌ఎస్‌ఐ, బీబీఏలో రీటైల్‌ ఆపరేషన్స్‌, పబ్లిక్‌ పాలసీ అండ్‌ గవర్నెన్స్‌, హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌ వంటి కోర్సులు ఉన్నాయన్నారు. వీటి ద్వారా విద్యార్థులకు త్వరితగతిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌లో ఇంటర్న్‌షిప్‌ ఉంటుందని, వివిధ కంపెనీల్లో పని చేయడం ద్వారా అనుభవంతో పాటు వేతనం కూడా పొందవచ్చని వివరించారు. ఎంవీఎస్‌ కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అర్హత గల అధ్యాపకులు, పూర్తిస్థాయిలో వసతులు, ఎన్‌ఎసీసీ వంటి సదుపాయాలు ఉన్నాయన్నారు. వివిధ కోర్సులకు సంబంధించి దోస్తు అడ్మిషన్లలో మొదటి ఆప్షన్‌గా ఎంవీఎస్‌ కళాశాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు రవీందర్‌, సత్యనారాయణ, మంజూల, సూర్యనారాయణ, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement