నీలినీడలు..! | - | Sakshi
Sakshi News home page

నీలినీడలు..!

May 8 2026 12:31 PM | Updated on May 8 2026 12:31 PM

50 శాతం కూడా చేరని లక్ష్యం

ఉమ్మడి జిల్లాలో పుష్కలంగా నీటి

వనరులున్నా ప్రోత్సాహం కరువు

నెరవేరని ఉచిత చేపవిత్తనాల

పంపిణీ లక్ష్యం

మత్స్యకారుల జీవనోపాధిపై

తీవ్ర ప్రభావం

ఉమ్మడి జిల్లాలో

అవసరమయ్యే

చేపపిల్లలు..

జిల్లా చెరువులు జలాశయాలుచేపపిల్లలు

(కోట్లలో)

మహబూబ్‌నగర్‌ 1092 1 1.98

నాగర్‌కర్నూల్‌ 715 6 2.41

నారాయణపేట 506 3 1.37

వనపర్తి 653 5 2.02

జో. గద్వాల 140 6 1.46

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: మత్స్యశాఖ నిర్లక్ష్యధోరణితో మత్స్యకారులను చేపపిల్లల కొరత వెంటాడుతోంది. ఉమ్మడి జిల్లాలో పుష్కలంగా నీటి వనరులున్నా.. చేపపిల్లల ఉత్పత్తి లేకపోవడంతో మత్స్యకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చేపపిల్లల పంపిణీ కోసం టెండర్లు పిలిస్తే ఆసక్తి గల కాంట్రాక్టర్లు పాల్గొనకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుతో పాటు పెంపకానికి ప్రభుత్వం సహకారం అందిస్తున్నా.. ఆసక్తి కనిపించడంలేదు. ఫలితంగా మత్స్యకారుల కుటుంబాల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని అమలుచేస్తున్న ఉచిత చేపపిల్లల పంపిణీ అబాసుపాలవుతోంది.

నీటితో కళకళలాడుతున్న చెరువులు, కుంటలు, ఇతర జలాశయాల్లో ఉచితంగా చేపపిల్లలు వదిలి మత్స్యకారులకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో చేపట్టిన పథకం ఆశించినస్థాయిలో అమలుకాకపోవడం అసంతృప్తికి గురిచేస్తోంది. ఉమ్మడి జిల్లాలో గతేడాది దాదాపు 9కోట్ల చేపపిల్లలు ఉచితంగా పంపిణీ చేయాల్సి ఉండగా.. చేపపిల్లల కొరతతో 50 శాతం కూడా లక్ష్యాన్ని చేరుకోకపోవడం గమనార్హం. ఉచిత చేపపిల్లల పంపిణీకి ప్రభుత్వం టెండర్లు పిలిస్తే.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి టెండర్లలో పాల్గొంటున్నారు. తెలంగాణలో చేపపిల్లలను ఉత్పత్తి చేసే టెండరుదారులు మాత్రం ఆసక్తి చూపడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉచిత చేపపిల్లల పంపిణీ నామమాత్రంగా ఉండటంతో వృత్తిని నమ్ముకొని బతుకుతున్న మత్స్యకారుల్లో నైరాశ్యం నెలకొంది.

ప్రోత్సాహం కరువు..

మ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో జూరాలప్రాజెక్టు, కోయిల్‌సాగర్‌, సరళాసాగర్‌, కల్వకుర్తి ఎత్తిపోతలతో పాటు వివిధ జలాశయాల వద్ద చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయడానికి అవకాశాలున్నాయి. అయితే ఆసక్తి ఉన్న మత్స్యకారులను ప్రోత్సహిస్తే ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు ముందుకొచ్చే అవకాశముంది. మత్స్యరంగాన్ని బలోపేతం చేయాల్సిన మత్స్యశాఖ అధికారులు.. ప్రైవేటు కాంట్రాక్టర్లకే ప్రాధాన్యం ఇస్తుండటం పలు అనుమానాలకు తానిస్తోంది. ప్రతి సంవత్సరం ఉమ్మడి జిల్లాలో అవసరమున్న 9 కోట్ల చేపపిల్లల పంపిణీకి ప్రభుత్వం రూ.16.50 కోట్ల వరకు చెల్లింపులు చేయాల్సిన పరిస్థితి. అదే ఇక్కడి మత్స్యకారులే ఉత్పత్తిదారులుగా తయారైతే ఆర్థికంగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది.

కొత్త దరఖాస్తులు రావడం లేదు..

మహబూబ్‌నగర్‌ జిల్లాలో రెండు చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. అందులో పిల్లలమర్రి ఉత్పత్తి కేంద్రంలో చేప పిల్లల ఉత్పత్తి జరగడం లేదు. కోయిల్‌సాగర్‌ లో ఉన్న ఉత్పత్తి కేంద్రంలో సగం మాత్రమే ఉత్పత్తి జరుగుతుంది. ఈ కేంద్రంలో మరమ్మతు చేపట్టి పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో అస్యూర్డ్‌ వాటర్‌ లేనందున కొత్త దరఖాస్తులు ఏమి రావడం లేదు.

– రాధారోహిణి, జిల్లా మత్స్యశాఖ అధికారిణి

మహబూబ్‌నగర్‌ పిల్లలమర్రి వద్ద నిరుపయోగంగా

ఉన్న చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం

ప్రభుత్వ ఉత్పత్తి కేంద్రాలిలా..

జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ సమీపంలో దాదాపు 20 ఎకరాల్లో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదించారు.

అచ్చంపేట మండలం చంద్రసాగర్‌లో 14 లక్షల చేపపిల్లల సామర్థ్యం కలిగిన పెంపకం కేంద్రం నిరుపయోగంగా మారింది.

ఊర్కొండ మండలం ముచ్చర్లపల్లిలో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం 12 ఏళ్ల క్రితం మూతపడింది.

వనపర్తి జిల్లా మదనాపురం మండలం సరళాసాగర్‌ వద్ద చేపపిల్లల పెంపకం కేంద్రాన్ని పెబ్బేరు మత్స్యకళాశాల విద్యార్థుల అవగాహన కోసం నిర్వహిస్తున్నారు. ఇందులో దా దాపు 20వేల చేపపిల్లలను పెంచుతున్నారు.

గద్వాల జిల్లా జములమ్మ రిజర్వాయర్‌ వద్ద నిరుపయోగంగా ఉన్న చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని తొలగించి, ఆలయ అవసరాల కోసం నిర్మాణాలు చేపట్టారు.

దేవరకద్ర మండలం కోయిల్‌సాగర్‌ వద్ద కోటి చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం ఉన్నా ప్రస్తుతం 60 లక్షలు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. పూర్తిస్థాయిలో ఉత్పత్తికి మరమ్మతు చేపట్టాల్సి ఉంది. పిల్లలమర్రిలో ఉన్న ఉత్పత్తి కేంద్రం నిరుపయోగంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement