అయిజలో ముందుకుసాగని 30 పడకల ఆస్పత్రి నిర్మాణం
● 2017లో రూ.1.10 కోట్లు మంజూరు
● రూ. 80లక్షల పనులకు మాత్రమే
టెండర్
● నిధులలేమితో అసంపూర్తిగా పనులు
● పీహెచ్‌సీలో మెరుగైన వసతులు లేక రోగుల అవస్థలు
–8లో u
అయిజ: జిల్లాలోనే అయిజ ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి రోగుల తాకిడి అధికంగా ఉంటోంది. ఇక్కడ రోజూ 250 పైగా ఓపీ నమోదవుతోంది. మరో 10 మంది ఇన్ పేషెంట్లు ఉంటారు. కాన్పుల సంఖ్య కూడా అధికమే. అయిజ మండలంతో పాటు మల్దకల్, గట్టు, వడ్డేపల్లి మండలాల నుంచి ప్రజలు ఎక్కువగా వస్తుండటంతో పీహెచ్‌సీ భవనం ఏమాత్రం సరిపోవడం లేదు. శిథిలావస్థకు చేరిన పీహెచ్‌సీలో రోగులు మౌలిక వసతులకు నోచుకోక అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పీహెచ్‌సీ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో 30 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మాణానికి 2017లో అప్పటి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
2021లో నిర్మాణానికి శ్రీకారం..
మాతా శిశు సంరక్షణ కేంద్రం (30 పడకల ఆస్పత్రి) నిర్మాణానికి ప్రభుత్వం రూ. 1.10 కోట్లు మంజూరు చేయగా.. 2021 సెప్టెంబర్ 30న అప్పటి ఎమ్మెల్యే అబ్రహాం శంకుస్థాపన చేశారు. అయితే కరోనా విపత్తు సమయంలో అత్యవసర పనుల కోసం అప్పటి కలెక్టర్ రూ. 30లక్షల నిధులను ఖర్చుచేశారు. మిగిలిన రూ. 80లక్షల పనులకు మాత్రమే టెండరు ప్రక్రియ పూర్తిచేసి, పనులు చేపట్టారు.
ఐదేళ్లుగా అసంపూర్తిగానే..
30 పడకల ఆస్పత్రి నిర్మాణానికి నిధుల కొరత కారణంగా ఐదేళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయింది. ఆస్పత్రిలో వైద్యుల గదితో పాటు స్టాఫ్ నర్సు గది నిర్మించాలి. వాటితో పాటు 12 పడకల గదులు రెండు, ఆరు పడకల గది ఒకటి, మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు ఇతర పనులు చేపట్టాల్సి ఉంది. అయితే ఆస్పత్రి నిర్మాణం పూర్తి కావడానికి మరో రూ. 50లక్షలు అవసరమవుతాయని సంబంధిత అధికారులు నిర్ధారణకు వచ్చారు. నిధుల కోసం 2024లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించగా.. నేటి వరకు నిధులు మంజూరు కాలేదు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి 30 పడకల ఆస్పత్రి నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేసి.. అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.


