పారదర్శకంగా రెడ్‌క్రాస్‌ సభ్యత్వ నమోదు | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా రెడ్‌క్రాస్‌ సభ్యత్వ నమోదు

May 7 2026 8:14 AM | Updated on May 7 2026 8:14 AM

గద్వాల: జిల్లాలో రెడ్‌క్రాస్‌ సొసైటీ సభ్యత్వ నమోదు, విరాళాల సేకరణ పారదర్శకంగా చేపట్టాలని.. ఎక్కడైనా నగదు స్వీకరణ జరిగితే వెంటనే రెడ్‌క్రాస్‌ సొసైటీ ఖాతాలో జమ చేయాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇప్పటికే సుమారు 1200 మంది రెడ్‌క్రాస్‌ సభ్యులు ఉండగా.. మరికొంత మంది నమోదు ప్రక్రియలో ఉన్నారన్నారు. ఈ సంఖ్యను గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వ ఉద్యోగులు విద్యాసంస్థలు, స్వచ్చంద సంస్థలు, యువత ముందుకురావాలని కోరారు. జీవితకాలం సభ్యత్వం రూ.వెయ్యి మాత్రమే ఉండటం వల్ల ప్రజలు సులభంగా సభ్యత్వం పొందవచ్చన్నారు. సభ్యత్వ నమోదు కోసం కలెక్టరేట్‌లోని ప్రజాపాలన విభాగంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటుచేసి.. అక్కడే నేరుగా రిజిస్ట్రేషన్‌ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. అందుకు అవసరమైన సిబ్బందిని ప్రత్యేకంగా నియమించాలన్నారు. వార్షిక ఆడిట్‌ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఆర్థిక వ్యవహారంలో ఎలాంటి లోపాలు ఉండకూడదన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ నర్సింగ్‌రావు, రెడ్‌క్రాస్‌ నోడల్‌ అధికారి వేణుగోపాల్‌, మంజుల, అజారుద్దీన్‌ తదితరులు ఉన్నారు.

ఈవీఎంల గోదాం పరిశీలన..

ఈవీఎంలు, బ్యాలెట్‌ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ అన్నారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఉన్న ఈవీఎంల గోదాంను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. కలెక్టర్‌ వెంట ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ మంజుల ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement