ఇటిక్యాల: ఆయిల్‌పాం సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని ఆత్మ డిప్యూటీ డైరెక్టర్ జగ్గూనాయక్, అలంపూర్ ఏడీఏ సక్రియానాయక్ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక, రైతు వారోత్సవాల్లో భాగంగా మంగళవారం బీచుపల్లి ఆయిల్ మిల్లులో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రకాల పంటల స్టాల్స్ ఏర్పాటుచేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా, లాభదాయక పంటల సాగుపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. రాష్ట్రంలో సాగునీటి సౌకర్యాలు పెరగడంతో రైతులు వరి, మొక్కజొన్న, పత్తి వంటి సంప్రదాయ పంటలను అధికంగా సాగుచేస్తున్నారని.. వాటితో పోలిస్తే ఆయిల్‌పాం సాగుతో దీర్ఘకాలిక ఆదాయం పొందవచ్చన్నారు. ఒకసారి మొక్కలు నాటితే 25 నుంచి 30 ఏళ్ల వరకు రైతుకు స్ధిరమైన దిగుబడి వస్తుందన్నారు. ఈ పంటకు చీడపీడల సమస్య తక్కువగా ఉండటంతో పాటు అకాల వర్షాల ప్రభావం ఉండదన్నారు. మొదటి నాలుగు సంవత్సరాలు అంతర పంటలతో అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. రైతులు ఆయిల్‌పాం సాగును విస్తృతంగా చేపట్టి అధిక లాభాలు పొందాలని సూచించారు. పంటమార్పిడితో నేల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ విజితా బీసీరెడ్డి, ఆయిల్‌ఫెడ్ నర్సరీ ఇన్‌చార్జి శివనాగిరెడ్డి, ఫ్యాక్టరీ ఇన్‌చార్జి బాలకృష్ణ, ఉద్యానశాఖ అధికారులు ఇమ్రానా, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.


