మళ్లీ.. బీసీ లొల్లి!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: వెనుకబడిన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్‌పై మళ్లీ లొల్లి మొదలైంది. హైదరాబాద్‌లో సాయి ఈశ్వరాచారి మృతితో బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఆయా సంఘాలకు చెందిన పలువురు నేతలు ఆయనది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్యే అని ధ్వజమెత్తుతున్నారు. ఈ క్రమంలో బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లాలో కొవ్వొత్తుల ప్రదర్శనకు పిలుపునివ్వగా.. వేడి రాజుకుంది. పంచాయతీ పోరు మొదటి విడతలో ప్రచారం హోరెత్తుతుండగా.. రెండో దశకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు పూర్తి కాగా.. నేటి నుంచి ప్రచారం మొదలు కానుంది. చివరి దఫాకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. ఇలా పంచాయతీ సంగ్రామం కీలక ఘట్టానికి చేరుకున్న క్రమంలో మళ్లీ బీసీ లొల్లి రాజుకోవడం రాజకీయ పార్టీలను కలవరానికి గురి స్తోంది.
42 శాతం ఏమైంది..
స్థానిక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తొలుత బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ ఆర్డినెన్స్ తెచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత స్థానిక ఎన్నికలకు వెళ్లగా.. హైకోర్టులో అడ్డంకులు ఎదురయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలై.. నోటిఫికేషన్ వెలువడే రోజు రిజర్వేషన్లు 50 శాతం పరిమితి దాటొద్దనే సుప్రీంకోర్టు సూచనలతో ప్రక్రియ నిలిచిపోయింది. ఈ క్రమంలో బీసీ సంఘాలు ఉద్యమాన్ని తీవ్రం చేసే దిశగా అడుగులు వేశాయి. కాంగ్రెస్ ముఖ్య నేతలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌పై వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని.. ప్రస్తుతం చట్టపరంగా ముందుకెళ్లలేని పరిస్థితి ఉందని చెప్పారు. ఈ మేరకు పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తూ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం మూడు దశల పల్లె పోరు కీలక ఘట్టానికి చేరుకోగా.. బీసీలకు 42 శాతం సీట్ల కేటాయింపు ఎంతవరకు వచ్చిందంటూ బీసీ సంఘాలు ప్రశ్నలు సంధిస్తున్నాయి.
సంఘటితంగా పోరు బాట..
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనలో భాగంగా బీసీ సంఘాలు, వెనుకబడిన తరగతులకు చెందిన కులసంఘాలు సంఘటితంగా పోరాడాలని నిర్ణయించాయి. ప్రధానంగా బీసీ సంక్షేమ, బీసీ సమాజ్, బీసీ పొలిటికల్ జేఏసీ, మున్నూరు కాపు, ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ, బీసీ లెక్చరర్ల ఫోరం, విశ్వకర్మ, బీసీ మేధావులు, యాదవ, నాయీబ్రాహ్మణ, రజక తదితర సంఘాలు ఏకమై బీసీ ఐక్యకార్యాచరణ కమిటీగా ఏర్పడ్డాయి. రెండు దశలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ.. చివరి దశలో నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసిన నేపథ్యంలో బీసీలకు పార్టీ పరంగా 42 శాతం సీట్లు కేటాయిస్తామన్న అధికార కాంగ్రెస్ నేతల హామీ ఏమైంది అంటూ బీసీ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. బీసీలకు మద్దతు ప్రకటించడం వరకు మాత్రమే బీఆర్‌ఎస్, బీజేపీ పరిమితమా అని నిలదీస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయించాలని ఈశ్వరాచారి ఆత్మహత్యకు యత్నించడం.. చికిత్సపొందుతూ ఆయన మృతి చెందడం వెనుకబడిన వర్గాల్లో విషాదం అలుముకుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఆదివారం కొవ్వొత్తుల ప్రదర్శనకు పిలుపునివ్వడంతో మళ్లీ సెగ రాజుకున్నట్లు తెలుస్తోంది.
మా
ఓటు బీసీలకే..
42 శాతం రిజర్వేషన్‌పైసంఘాల పోరు
ఇప్పటికే బీసీ ఐక్య
కార్యాచరణ కమిటీ ఏర్పాటు
హైదరాబాద్‌లో
సాయి ఈశ్వర చారి మృతితో కదలిక
నేడు కొవ్వొత్తుల ప్రదర్శనకు పిలుపు
ఉమ్మడిగా దశల వారీ
ఉద్యమబాటకు సన్నాహాలు
సం‘గ్రామం’ వేళ మారుతున్న పరిణామాలతో రాజకీయ
పార్టీల్లో కలవరం
మళ్లీ.. బీసీ లొల్లి!


