ముగిసిన నామినేషన్ల పర్వం
గద్వాలటౌన్/అలంపూర్: బతిమాలో.. భంగపడో మొత్తానికి ప్రధాన రాజకీయ పార్టీల మద్దతుదారులు దాదాపు తమ తిరుగుబాటు అభ్యర్థులను దారికి తెచ్చుకున్నారు. జిల్లాలో రెండో దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన శనివారం ప్రధాన పార్టీల మద్దతుదారులను భయపెట్టిన రెబల్స్‌తో పాటు కొంతమంది ప్రత్యర్థి పార్టీల మద్దతుదారులు పోటీ నుంచి పక్కకు తప్పుకున్నారు. మల్దకల్ మండలంలో కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యే వర్గం, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత వర్గాల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. అయిజ, రాజోలి, వడ్డేపల్లి మండలాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మద్దతుదారుల మధ్య పోటీ త్రీవంగా ఉంది. ఽఆయా వర్గాల మద్దతుదారులకు తిరుగుబాటు బెడద తప్పడం లేదు. వారి వల్ల తమ విజయావకాశాలకు వచ్చే నష్టం లేదని పార్టీ మద్దతుదారులు ఎమరికి వారు ధీమాగా ఉన్నా ఎంతోకొంత ప్రభావం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండవ దశ గ్రామ పంచాయతీలలో ఉపసంహరణ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. దీంతో ఎన్నికల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణలో ఆయా ఎన్నికల నామినేషన్ కేంద్రాలు నాయకులు, కార్యకర్తలతో కిక్కిరిసిపోయాయి.
18 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం
పంచాయతీ రెండవ దశ ఎన్నికలలో పలు గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. రెండవ దశ ఎన్నికలు జరిగే మల్దకల్, అయిజ, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లోని 74 గ్రామ పంచాయతీలకుగాను 18 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మల్దకల్ మండలంలో 5, అయిజలో 7, వడ్డేపల్లిలో 5, రాజోలి మండలంలో 1 గ్రామ పంచాయతీలలో సింగిల్ నామినేషన్ దాఖలు కావడంతో వాటిని అధికారులు ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. కోరం ఉన్న గ్రామ పంచాయతీలలో ఉప సర్పంచులను సైతం ఎన్నుకున్నారు.
గుర్తుల కేటాయింపు
రెండో విడత నామినేషన్ల ఘట్టం పూర్తవగా.. ఈనెల 14న జరిగే ఎన్నికలకు పోటీలో ఉండే సర్పంచు, వార్డు సభ్యులకు వేర్వేరుగా కేటాయించే గుర్తులను అధికారులు ప్రకటించారు. ఎన్నికల సంఘం నుంచి పంచాయతీ అధికారులకు వచ్చిన ఉత్తర్వుల మేరకు గుర్తులను కేటాయించారు. పోటీలో నిలిచే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నా ఇబ్బంది కలగకుండా 10–15 రకాల గుర్తులను కేటాయిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ గుర్తులతో కూడిన వివరాలు అన్ని గ్రామ పంచాయతీలకు చేరాయి. నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన వెంటనే పోటీలో నిలిచిన అభ్యర్థులకు అధికారులు అధికారికంగా గుర్తులను కేటాయించారు. ఈ నెల 7వ తేదీ నుంచి పోలింగ్‌కు ముందు రోజు వరకు కేవలం వారం రోజుల వ్యవధి మాత్రమే ఉంది. దీంతో అభ్యర్థులు వారికి కేటాయించిన గుర్తులతో కరపత్రాలు, వాల్‌పోస్టర్లు ముద్రించుకుని ఓటర్ల వద్దకు వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బిర్యానీలు, మద్యం సీసాల పంపిణీకి ఇంకొందురు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మొత్తంగా అసలు సిసలు ఎన్నికల వాతావరణం పల్లెల్లో మొదలైంది.
మూడో విడతలో జోరుగా నామినేషన్లు
మూడో విడతగా అలంపూర్, మానవపాడు, ఉండవల్లి, ఇటిక్యాల, వడ్డేపల్లి మండలాల సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ శుక్రవారం ముగిసింది. చివరి రోజు కొన్ని కేంద్రాల్లో నామినేషన్ ప్రక్రియ అర్ధరాత్రి సైతం కొనసాగిన విషయం తెలిసిందే. ఐదు మండలాల్లో 75 సర్పంచ్ స్థానాలకు 438, 700 వార్డులకు 1489 నామినేషన్లు దాఖలయ్యాయి.
మూడో విడతలో సర్పంచ్‌కు 438, వార్డులకు 1489 నామినేషన్లు
రెండో దశలో 18 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం
ఊపిరి పీల్చుకున్న పార్టీలు
సమరానికి సిద్ధమైన అభ్యర్థులు


