ఓటులోనూ నారీ శక్తి!
జిల్లాల వారీగా ఓటర్ల వివరాలు ఇలా..
సాక్షి, నాగర్‌కర్నూల్: పంచాయతీ ఎన్నికల్లో మహిళలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల బరిలో మహిళలే అధిక సంఖ్యలో పోటీలో ఉండగా.. ఓటర్లుగానూ పురుషుల కన్నా మహిళల సంఖ్యే ఎక్కువగా ఉంది. ఫలితంగా ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేసేలా మహిళాశక్తి పనిచేయనుంది. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లోనూ పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. వీరి ఓట్లను గంపగుత్తగా దక్కించుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
50 శాతం రిజర్వేషన్..
పంచాయతీ ఎన్నికల్లో మొత్తం సర్పంచ్, వార్డు స్థానాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉండగా, ఈ మేరకు స్థానాలన్నింటిలో మహిళలే అభ్యర్థులుగా బరిలో ఉంటున్నారు. వీటితోపాటు జనరల్ స్థానాల్లోనూ కొన్నిచోట్ల మహిళలు పోటీలో ఉంటున్నారు. గతంలో మహిళ రిజర్వేషన్ ఉన్నచోట్ల ప్రజాప్రతినిధులుగా ఎన్నికై న వారు ఈసారి రిజర్వ్ కాకపోయినా పోటీలో ఉంటున్నారు. అలాగే ఇప్పటికే ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు జనరల్ స్థానాల్లోనూ తమ సతీమణులను బరిలో దింపుతున్నారు. మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కారణంగా 50 శాతం స్థానాలతోపాటు మిగతా రిజర్వ్ కాని చోటా మహిళలు పోటీచేస్తుండటంతో 50 శాతానికి మించి మహిళలే ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కానున్నారు.
సంఘాలతో సంప్రదింపులు..
గ్రామాల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే శక్తిగా మహిళా ఓటర్లు ఉండటంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు దృష్టిసారిస్తున్నారు. ప్రత్యేకంగా మహిళా సంఘాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. స్థానికంగా మహిళల సమస్యలపై దృష్టిసారించి హామీలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో త్వరితగతిన పరిష్కారానికి వీలున్న వాటిని పూర్తిచేసేందుకు సైతం ప్రయత్నాలు సాగిస్తున్నారు.
జిల్లా పురుషులు మహిళలు మొత్తం ఓటర్లు
మహబూబ్‌నగర్ 2,48,222 2,51,349 4,99,582
నాగర్‌కర్నూల్ 3,23,016 3,24,315 6,47,342
వనపర్తి 1,90,068 1,92,223 3,82,295
జోగుళాంబ గద్వాల 1,93,627 1,99,781 3,93,418
నారాయణపేట 1,94,124 2,02,410 3,96,541
పంచాయతీ ఎన్నికల్లో ప్రభావిత వర్గంగా మహిళా శక్తి
ఎన్నికల బరిలో 50 శాతంపైగా వారిదే హవా
జనరల్ స్థానాల్లోనూ పోటాపోటీ
ఇటు ఓటర్లు గానూ మెజార్టీ స్థాయిలో..


