వడ్డించేది నేనే.. ఎన్ని నిధులైనా ఇస్తా
ప్రజాపాలన–ప్రజా విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
● పదేళ్లలో వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసుకుందాం
● దేశంలోనే పాలమూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
● ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ వచ్చాక కూడా జిల్లాను ఎవరూ పట్టించుకోలేదు
● మక్తల్, అత్మకూర్ పురపాలికల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/నారాయణపేట: ‘పాలమూరు జిల్లాకు వేలకోట్ల నిధులు ఇస్తున్నాం. వడ్డించేది నేనే. ఎన్ని నిధులైనా ఇస్తా. పాలమూరు పచ్చబడాలే. అభివృద్ధిలో దేశంలోనే పాలమూరు జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ జిల్లాను ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. పదేళ్లలో పాలమూరును వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసుకుందాం.’అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన–ప్రజా విజయోత్సవాల సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్‌లో ఏర్పాటు చేసిన తొలి బహిరంగసభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా సోమవారం మధ్యాహ్నం 2.25 గంటలకు వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణానికి చేరుకున్న సీఎంకు అక్కడ భారీ స్వాగతం పలికారు. పీజేపీ క్యాంపు వద్ద ఆత్మకూరు పురపాలికలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం మధ్యా హ్నం 3 గంటలకు హెలికాప్టర్‌లో మక్తల్‌కు బయల్దేరారు. మంత్రులు వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహతో కలిసి మక్తల్‌లోని పడమటి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశా రు. అక్కడి నుంచి సభా వేదిక వద్దకు చేరుకుని రూ. 1,038 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పను లకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజా విజయోత్సవాల సభలో సీఎం ప్రసంగించారు.
సంక్షేమానికి పెద్దపీట..
‘రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా ఇంటింటికి సన్నబియ్యం అందిస్తున్నాం. ఇది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమైంది. మహిళలకు ఆర్టీసీ బస్సులకు ఓనర్లు చేశాం. వచ్చిన పైసలు కరెంట్ బిల్లుకు సరిపోయేదని, దానిని దృష్టిలో పెట్టుకొని ఉచిత కరెంట్ అందిస్తున్నాం. నారాయణపేట మహిళలకు పెట్రోల్ బంక్ మంజూరు చేశాం. మహిళలు తయారు చేసిన వస్తువులను అమెజాన్‌లో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం. రైతులకు 25.35 లక్షల రైతులకు రూ.21,653 కోట్ల రుణమాఫీ చేశాం. ఏడాదికి రూ.12 వేల రైతు భరోసాను వేశాం. 1.04 కోట్లు రైతుల కోసం ఖర్చు చేశాం. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సరైన దిశలో నడిపించడానికి నిరంతరం పని చేస్తున్నాం.’ ముఖ్యమంత్రి అన్నారు.
సాగుతో పాటు విద్యారంగానికి ప్రాధాన్యత
‘సాగుతో పాటు విద్యారంగానికి కూడా ప్రాధాన్యత కింద తీసుకున్నాం. ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్యను అందించాలని గుర్తించాం. ప్రతి నియోజకవర్గానికి 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ నిర్మించుకుంటున్నాం. రూ.220 కోట్లతో రెసిడెన్షియల్ పనులు చేపడుతున్నాం. పార్టీలు, జెండాలు, ఏజెండా చూసుకోకుండా ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఈ స్కూళ్లను మంజూరు చేశాం. జడ్చర్ల–దేవరకద్ర, మహబూబ్‌నగర్ మధ్యలో ఐఐఐటీని ప్రారంభించుకున్నాం. పీయూలో లా, ఇంజనీరింగ్ కళాశాలలు మంజూరు చేసుకున్నాం.’ అని సీఎం పేర్కొన్నారు.
మీ ఆశీర్వాదంతోనే సీఎం అయ్యాను..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ వేడుకలను మొదటగా మక్తల్‌లోనే నిర్వహించాలని మంత్రి వర్గ సహచరులు నిర్ణయించారని సీఎం పేర్కొన్నారు. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి అడగడంతో మక్తల్ నుంచే ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇన్నాళ్లు ‘కౌన్ పూచేగా మక్తల్ అని పాత నానుడిని కాదని.. సబ్ కుచ్ పూచేగా, సబ్ కుచ్ ఆయేగా మక్తల్’ అని ఇక్కడ విజయోత్సవం ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. 2023 డిసెంబర్ 7న ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిందని.. ఉమ్మడి జిల్లా నుంచి 12 మంది ఎమ్మెల్యేలను గెలిపించి తనకు అండగా నిలబడ్డారని, పార్టీ, ప్రజలు ఆశీర్వదిస్తే తెలంగాణకు రెండో సీఎం అయ్యానన్నారు. ఆనాడు మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి సీఎంగా బూర్గుల రామకృష్ణారావు కాగా.. 75 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా మీ బిడ్డ సీఎం అయి మీ ముందు నిలబడ్డానన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వండి
‘మంచోడు సర్పంచు అయితే ఊరు బాగుపడుతది. ముంచేటోడికి ఓటు వేస్తే ఊరు పాడవుతుందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే మద్దతుదారులకు ఓటర్లు పట్టం కట్టాలి. మంచి వాళ్లను ఎన్నుకోవాలి. నీళ్లు, నిధులు ఇచ్చే వారికి ఓట్లు వేయాలి. ఎమ్మెల్యే, మంత్రుల వద్దకు వెళ్లి అభివృద్ధి పనులు మంజూరు చేసుకునే నాయకులను సర్పంచులుగా గెలిపించుకోవాలి. నిధులు, నీళ్లు, రైతుల పంటకు బోనస్ ఇచ్చే బాధ్యత నాది. మీరందరూ మళ్లీ ఆశీర్వదించాలి. పదేళ్లలో పాలమూరును వందేళ్లకు సరిపడే విధంగా అభివృద్ధి చేసుకుందాం. గట్టిగా చప్పట్లు కొడితే ఢిల్లీకి వినిపించాలి. సీటీలు కొడితే పాలమూరు జిల్లా ఏకమైందని.. ఢిల్లీలో ఆ దుర్మార్గుల గుండెలు ఆగిపోవాలె.’ అని సీఎం రేవంత్ తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మధుసూదన్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్, మేఘారెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు ఒబేదుల్లా కొత్వాల్, సీతా దయాకర్‌రెడ్డి, శివసేనారెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్లు స్వర్ణసుధాకర్‌రెడ్డి, సరిత, డీసీసీ అధ్యక్షులు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, రాజీవ్‌రెడ్డి, సంజీవ్ ముదిరాజ్, బీకేఆర్ చైర్మన్ బాలకిష్టారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


