పల్లెపోరుపై హైఅలర్ట్
● నగదు.. మద్యం పంపిణీపై నిఘా
● అల్లర్లకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి
● శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీసు శాఖ చర్యలు
జిల్లాలో విస్తృతంగా తనిఖీలు
గద్వాల క్రైం: గ్రామ పంచాయతీ ఎన్నికల సంగ్రామంలో ఎలాంటి అల్లర్లు, హింసాత్మక సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసుశాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. మొదటి విడతగా 106 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సైతం పూర్తి అయ్యింది. గద్వాల, కేటీదొడ్డి, ధరూర్, గట్టు మండలాల్లో ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అభ్యర్థులు తదితర వివరాలపై ఇప్పటికే ఫ్లయింగ్ సర్వైలైన్ టీం(ఎఫ్‌ఎస్‌టీ), స్టాటిక్ సర్వైలైన్స్(ఎస్‌ఎస్‌టీ) బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఓటర్లకు మద్యం, నగదు, వస్తు సామగ్రి వంటివి అందించే వారిపై కేసులు నమోదుకు చర్యలు తీసుకుంది.
సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు
జిల్లా సరిహద్దులోని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లోని పోలీసు సిబ్బంది చెక్‌పోస్టుల వద్ద విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ప్రతి మండలానికి ప్రత్యేక బృందం ఎన్నికల నియమావళికి సంబంధించిన ఫిర్యాదులపై స్పందిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలపై నిఘా ఉంచి సోదాలు చేస్తున్నారు. తహసీల్దార్ స్థాయి అధికారి, నలుగురు పోలీసులు, వీడియోగ్రాఫర్ సైతం విధుల్లో ఉంటున్నారు. స్టేషన్ పరిధిలోని సిబ్బంది, ప్రత్యేక బృందం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించి అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. పాత నేరస్తులు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, రౌడీ షీటర్ల వివరాలు సేకరిస్తున్నారు. గత ఎన్నికల్లో అల్లర్లు సృష్టించిన వారిని ముందుస్తుగా బైండోవర్ చేస్తున్నారు. అన్ని గ్రామాల్లో ప్రశాంత ఎన్నికలు నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. సామాజిక మాద్యమాల్లో అనుచిత వాఖ్యలు చేసినా, ఫార్వర్డ్ చేసినా, ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించినా ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు చేపడుతున్నారు.
ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు
గద్వాల, కేటీదొడ్డి, ధరూర్, గట్టు మండలాల్లో పంచాయతీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకున్నాం. నామినేషన్ల ప్రక్రియలో అభ్యర్థులు ఎవరూ ఇబ్బంది పడకుండా కేంద్రాల వద్ద పట్టిష్ట భద్రతా చర్యలు తీసుకున్నాం. ఎవరైన అల్లర్లు, దాడులు, హింసాత్మక సంఘటనలకు ప్రేరేపిస్తే సహించేది లేదు. ప్రత్యేక బృందాలు నిత్యం తనిఖీలు చేపడుతున్నాయి. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినా చర్యలు తప్పవు. పాత నేరస్తులను ముందుస్తుగా బైండోవర్ చేశాం. అత్యవసర సమయాల్లో డయల్ 100కు ఫోన్ ద్వారా లేదా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.
– శ్రీనివాసరావు, ఎస్పీ
నగదు, వస్తు తరలింపుపై ఆంక్షలు
ఎన్నికల నియమావళి మేరకు రూ.50 వేల కంటే అధికంగా నగదు, పెద్ద మొత్తంలో వస్తు సామగ్రి, మద్యం, చీరలు, ఇతర ఒకే రకమైన వస్తువులు తీసుకెళ్లినా ఆధారాలు చూపించాల్సిందే. లేని తరుణంలో అధికారులు వాటిని సీజ్ చేస్తారు. మరోవైపు ఎన్నికల సందర్భంగా సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. అత్యవసర సమయంలో డయల్ 100కు సమాచారం అందించాల్సిందిగా పోలీసుశాఖ అధికారులు చెబుతున్నారు. మొదటి విడత నామినేషన్ల పర్వం పూర్తికాగా, రెండో విడత నామినేషన్లు కొనసాగుతున్నాయి. నామినేషన్ల పర్వం పూర్తి అయిన వెంటనే ప్రచారమే తరువాయి గట్టంగా మిగిలింది.


