ఎన్నికల నియమావళి ఉల్లంఘించొద్దు
గద్వాల/మల్దకల్: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రభుత్వ నియమ, నిబంధనలను పాటించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. సోమవారం మల్దకల్, తాటికుంట నామినేషన్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఈమేరకు అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. నామినేషన్ వేసే అభ్యర్థుల వివరాలను టీపోల్ యాప్‌లో నమోదు చేయాలని, సాయంత్రం 5గంటల తర్వాత నామినేషన్లు వేసేందుకు వచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదని, నిర్దేశిత సమయంలోగా కేంద్రం లోపల ఉన్న వారి నుంచే అధికారులు నామినేషన్లను స్వీకరించాలన్నారు. అదే విధంగా సర్పంచు, వార్డు స్థానాలకు కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థుల నుంచి అవసరమైన ధ్రువపత్రాలు తీసుకుని విధిగా దరఖాస్తులను జతపరచాలని, డిక్లరేషన్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. నామినేషన్ వేసే అభ్యర్థులతో డిపాజిట్ తీసుకుని రశీదు ఇవ్వాలన్నారు. నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు మరో ఇద్దరిని మాత్రమే అనుమతించాలని సూచించారు. అభ్యర్థుల నుంచి సంబంధిత గ్రామ పంచాయతీకి చెల్లించే ఇంటి పన్నులు పెండింగ్ లేకుండా కట్టించుకోవాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఇతర అంశాలపై ముద్రించిన పత్రాలను నామినేషన్లు వేసిన వారికి అందజేయాలన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ ఆంజనేయరెడ్డి, ఎంఈఓ సురేష్, అధికారులు తదితరులు ఉన్నారు.
పకడ్బందీగా రెండో విడత నామినేషన్ల ప్రక్రియ
పకడ్బందీగా రెండో విడత నామినేషన్ల ప్రక్రియ నిర్వహించేలా అన్ని చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని మాట్లాడారు. జిల్లాలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ, పరిశీలన విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఎన్నికలను ప్రజాస్వామ్యబద్దంగా నిర్వహించేందుకు జిల్లా, మండల స్థాయి అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ర్యాండమైజేషన్ ద్వారా ఎన్నికల సిబ్బందిని అవసరమైన బ్యాలెట్ బాక్సులను కేటాయించడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్‌కాస్టింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించేలా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఎన్నికల ఎన్నికల పరిశీలకులు గంగాధర్, అదనపు ఎస్పీ శంకర్, డీపీవో శ్రీకాంత్, డిప్యూటీ సీఈవో నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు.


