ఆదిశిలా క్షేత్రంలో ప్రత్యేక పూజలు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు మధుసూదనాచారి, రమేషాచారి, రవిచారి స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం అన్నదానం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు అరవిందరావు, చంద్రశేఖర్‌రావు, ఆలయ సిబ్బంది ఉరుకుందు, కృష్ణ, శివమ్మ, రాము, శ్రీను, చక్రి, వాల్మీకి పూజారులు తదితరులు పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.5,310
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు శనివారం 847 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.5310, కనిష్టం రూ.2119, సరాసరి రూ.4120 ధరలు లభించాయి. అలాగే, 102 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ. 5949 కనిష్టం రూ. 3319, సరాసరి రూ. 5949 ధరలు పలికాయి. వీటితోపాటు 30 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ. 2017, కనిష్టం రూ. 1887, సరాసరి ధరలు రూ. 1887 వచ్చాయి.
ఇసుక క్వారీలు, చిన్న తరహా ఖనిజాలపై నివేదిక
గద్వాల: జిల్లాలో చిన్న తరహా ఖనిజాలు, ఇసుక క్వారీలపై పూర్తిస్థాయి నివేదికను ఇవ్వాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈమేరకు ఆయన ప్రకటనలో విడుదల చేశారు. జిల్లాలో సాంకేతిక, నీటిపారుదల, భూగర్భజల, గనులు మరియు భూగర్భ శాఖలకు చెందిన అధికారులు తమ శాఖల పరిధిలోని వివరాలను నివేదిక రూపొందించి సమర్పించాలని తెలిపారు. ఈనివేదికను ప్రజల సమాచార నిమిత్తం జిల్లా వెబ్‌సైట్ https.gadwal.telangana.gov.in లో పొందుపరుచనున్నట్లు తెలిపారు. ఈ నివేదికపై ప్రజల నుంచి వచ్చిన సూచనలు, సలహాలను అభ్యంతరాలు స్వీరించి ఈనెల 2వ తేదీ నుంచి 21వ తేదీలోపు పరిశీలన చేపట్టనున్నట్లు తెలిపారు.
విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడికి మెమో
గద్వాల: గద్వాల మండలం వీరాపురం సామాజిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న థామస్ అనే విద్యార్థిని ఆ పాఠశాల ఉపాధ్యాయుడు చితకబాదిన ఘటనపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఈమేరకు శనివారం సదరు ఉపాధ్యాయుడికి మెమో జారీ చేసినట్లు ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా ఈఘటనపై సమగ్ర నివేదిక కోరుతూ పాఠశాల ప్రిన్సిపల్‌ను ఆదేశించారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
మృత్యువులోనూ.. మరో ఇద్దరికి చూపు
గద్వాల క్రైం: తాను మరణించినా.. మరో ఇద్దరు అంధులకు కంటిచూపు ప్రసాదించాడు. మండలంలోని శెట్టి ఆత్మకూర్ గ్రామానికి చెందిన మెదరి ఈదన్న(46) గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యానికి గురై కర్నూలు లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే శుక్రవారం పరిస్థితి విషమించి మృతి చెందాడు. చికిత్స పొందుతున్న క్రమంలో వైద్యులు నేత్రాదానంపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. దీంతో తాను మృతి చెందిన మరో ఇద్దరికి చూపు అందిస్తామని గ్రహించి నేత్రాదానం చేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యులు ఈదన్న నేత్రాలను ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించారు.


