నాణ్యమైన ఆహారం అందించాలి
ఎర్రవల్లి: విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని డీఈఓ విజయలక్ష్మి అన్నారు. శనివారం మండలంలోని ధర్మవరం జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలను, వాటి తరగతి గదులు, వంటశాల, స్టోర్‌రూం, సైన్స్ ల్యాబ్‌లను పరిశీలించారు. వంటకు తాజా కూరగాయలు, ఆకుకూరలను మాత్రమే వినియోగించాలని, శుద్ధమైన తాగునీటిని మాత్రమే అందించాలని, వంట చేసేటప్పటి నుంచి ఆహారం వడ్డించే వరకు పరిశుభ్రతను తప్పకుండా పాటించాలని సూచించారు. అనంతరం సమీపంలోని బీసీ బాలుర వసతి గృహం విద్యార్థులు బసచేస్తున్న పాఠశాల హాల్‌ను పరిశీలించి విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని హెచ్‌ఎంను ఆదేశించారు.
ఆలయాల్లో
వివాదాలపై విచారణ
అలంపూర్ : అలంపూర్ క్షేత్ర ఆలయాల్లోని అధికారిపై ఉన్నతాధికారులు శనివారం విచారణ చేపట్టారు. శ్రీ జోగుళాంబ బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో టెండర్లకు సంబంధించి కొన్ని రోజులుగా వివాదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్ర దేవదాయ ధర్మాదాయ శాఖ హైదరబాద్ రీజనల్ జాయింట్ కమిషనర్ రామకష్ణా రావు, జాయింట్ కమిషనర్ వినోద్ రెడ్డిలు విచారణ జరిపారు. ఆలయ ఈఓ దీప్తిని కలిసి వివరాలను అడిగి తెలుసుకొని ఆలయాల రికార్డులను తనిఖీ చేసినట్లు సమాచారం. అలాగే టెండర్ దారును కలిసి వివరాలు సేకరించారు. అయితే అలంపూర్ రైతు సంఘం కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు సైతం విచారణ అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. నివేదికను ఉన్నత అధికారులకు నివేదిస్తామని వెల్లడించారు.


