ఫుడ్ పాయిజన్ కలకలం
రెండు రోజుల క్రితం బీసీ బాలుర హాస్టల్‌లో 55 మంది విద్యార్థుల అస్వస్థత
● తాజాగా ఎర్రవల్లి గురుకులంలో మరికొందరు..
● హాస్టల్స్, గురుకులాలపై కొరవడిన అధికారుల పర్యవేక్షణ
● వరుస ఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన
32 మంది డిశ్చార్చ్..
22 మంది ఆస్పత్రిలోనే
గత నెల 31వ తేదీ ఎర్రవల్లి మండలం ధర్మవరం బీసీ సంక్షేమ బాలుర హాస్టల్‌లో విద్యార్థులు రాత్రి భోజనం చేసి పడుకోగా.. కొంత సమయానికి ఒక్కొక్కరు మొత్తం 55మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని 5 అంబులెన్స్‌లలో గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ హాస్టల్‌లో మొత్తం 140 మంది విద్యార్థులు ఉన్నారు. శుక్రవారం రాత్రి సంఘటన జరిగే సమయానికి హాస్టల్‌లో 110 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. చికిత్స పొందిన వారిలో 32 మంది ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో డిశ్చార్చ్ చేశారు. దీంతో వారు ఆస్పత్రి నుంచి హాస్టల్‌కు చేరుకున్నారు. మరో 22 మంది విద్యార్థులు గద్వాల ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలాఉండగా, ఈ హాస్టల్ విద్యార్థులు అందరూ ఒకే హాల్‌లో ఉంటున్నారు. హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరగా.. నెల రోజుల క్రితం కలెక్టర్ హాస్టల్‌ను పరిశీలించారు. మరో భవనంలోకి మార్పు చేయాలని చెప్పగా.. హాస్టల్‌కు పక్కనే పాఠశాలకు చెందిన పైభాగంలోని హాల్‌లో మార్చారు. దీంతో విద్యార్థులంతా ఒకే హాల్‌లో ఉంటున్నారు.
అలంపూర్/ఎర్రవల్లి: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు.. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. నాణ్యతలేని ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరుతుండడంతో వారి తల్లిదండ్రుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం ఎర్రవల్లి మండలం ధర్మవరం బీసీ బాలుర వసతి గృహంలో భోజనం చేసిన విద్యార్థులు ఒక్కొక్కరుగా అస్వస్థతకు గురయ్యారు. మొత్తం 55 మంది జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే శనివారం ఉదయం ఎర్రవల్లిలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఉదయం అల్పాహారం తిన్న విద్యార్థుల్లో ముగ్గురు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. దీంతో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయ పరిస్థితి నెలకొంది. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకోవడం.. విద్యార్థులు ఆస్పత్రుల పాలవడం.. అధికారులు పర్యవేక్షణ ఏమేరకు ఉందనే ప్రశ్న ప్రజల నుంచి వ్యక్తమవుతుంది.
అధికారుల పర్యవేక్షణ ఏది..?
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్‌పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. గంటల వ్యవధిలో రెండు వసతి గృహాల్లో అది ఒకే మండలానికి చెందినవి కావడంతో విస్మయం వ్యక్తం అవుతుంది. వసతి గృహాలపై పర్యవేక్షణ లేకపోవడంతో నాణ్యత లోపంగా ఉన్న ఆహారంతోనే ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతం అవుతున్నాయనే ఆరోపణలు వినవస్తున్నాయి. విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన అధికారులు సైతం చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారని.. ఇదే అదునుగా సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పిల్లల ప్రాణాలతో చెలగాటం అడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గురుకుల పాఠశాలలోనూ..
ఎర్రవల్లి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఈ నెల 1వ తేదీన మరో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. ఈ పాఠశాలలో మొత్తం 540 మందికిగాను శనివారం 502 మంది విద్యార్థులు ఉన్నారు. వారందరూ ఉదయం అల్పాహారం తీసుకున్నారు. అతర్వాత గంట వ్యవధిలోనే ముగ్గురు విద్యార్థులు వాంతులు, విరేచనాలు కావడంతో పాఠశాల సిబ్బంది అంబులెన్స్‌లో విద్యార్థులను గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో మరికొందరు విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి సూచన మేరకు ఇటిక్యాల పీహెచ్‌సీ బృందం నేరుగా గురుకులా పాఠశాలకు చేరుకొని విద్యార్థులకు వైద్య పరీక్షలు అందించారు. ఇక్కడ 67 మంది అస్వస్థతకు గురయ్యారు. వైద్యులు వారికి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అక్కడే చికిత్స అందిస్తు పర్యవేక్షించారు.


