విద్యార్థులకు మెరుగైన వైద్యం
● కాలీఫ్లవర్, క్యాబేజి కూరగాయ తినడంతోనే అస్వస్థత
● కలెక్టర్ బీఎం సంతోష్
● హాస్టల్ వార్డెన్‌పై సస్పెన్షన్ వేటు
గద్వాల: ఎర్రవల్లి మండలం ధర్మవరం సాంఘిక సంక్షేమ వసతిగృహ విద్యార్థులు అస్వస్థతకు గురికాగా.. జిల్లా ఆస్పత్రిలో వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి వారి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. శుక్రవారం రాత్రి హాస్టల్‌లో భోజనంలో క్యాలీఫ్లవర్, క్యాబేజీతో కూడిన కూరగాయను చేశారని ఈ కూరగాయను భుజించిన విద్యార్థులలో 54మంది అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. వారిని వెంటనే అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈక్రమంలోనే 32మంది విద్యార్థులు కోలుకున్నారని వారిని శనివారం ఉదయం డిశ్చార్జి చేసి పంపినట్లు తెలిపారు. మిగిలిన 22మందికి వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన వైద్యం అందించడంతో వారు కూడా డిశ్చార్జి అయినట్లు తెలిపారు. విద్యార్థుల అస్వస్థతకు కారణమైన కూరగాయ శాంపిల్‌ను ఫుడ్‌ఇన్స్‌పెక్టర్‌కు పంపించి పరీక్షలు చేయిస్తామన్నారు. అదేవిధంగా బాయిల్డ్ ఎగ్ కూడా శాంపిల్‌కు పంపిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వసతిగృహాలను తహసీల్దార్, ఎంపీడీవోలు ఇక నుంచి వారానికోసారి సందర్శించేలా ఆదేశాలు జారీచేస్తామన్నారు.
వార్డెన్‌పై సస్పెన్షన్ వేటు
హాస్టల్‌లో విద్యార్థులకు రాత్రి భోజనం పెట్టే సమయంలో వార్డెన్ జయరాం గైర్హాజరు అయినట్లు ఇందుకుగాను ఆయనను సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిపారు. ఎవరైన అధికారులు అలసత్వం వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, డాక్టర్ ఇందిరా, తహసీల్దార్ మల్లీఖార్జున్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యేలు పరామర్శ
ధర్మవరం హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు గురై జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు పరామర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. బీజేపీ నాయకురాలు డీకే స్నిగ్ధారెడ్డి విద్యార్థులను పరామర్శించారు.


