దళారులదే రాజ్యం
● ఉండవెల్లి పత్తి కొనుగోలు కేంద్రంలో వారిదే పైచేయి
● పత్తి నల్లబారిందని, తేమశాతం
పెరిగిందంటూ రైతులను వెనక్కి ..
● మూడు రోజులు సెలవు.. దళారుల
పత్తి మాత్రం యథేచ్ఛగా కొనుగోలు
ఉండవెల్లి: జిల్లాలోని ఒకే ఒక్క పత్తి కొనుగోలు కేంద్రమైన ఉండవెల్లి సీసీఐ కేంద్రంలో దళారులదే పైచేయిగా మారింది. దళారులు తీసుకొచ్చిన పత్తిని ఎలాంటి తేమ శాతం చూడకుండానే కొందరు అధికారులు కేంద్రంలోకి అనుమతిస్తుండగా.. మిగతా రైతుల పత్తి మాత్రం నల్లబారిందని, తేమ శాతం పెరిగిందంటూ కొర్రీలు పెడుతూ తిప్పి పంపుతున్నారు. లేదా రోజుల తరబడి నిరీక్షించేలా చేస్తున్నారు. దీంతో రేయింబవళ్లు కష్టపడి పంట పండించిన రైతుకు.. పంట విక్రయించేందుకు సైతం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. దీనికితోడు జాతీయ రహదారిపై పత్తి లోడు వాహనాలతో ప్రమాదకరంగా ఎదురుచూడా ల్సి వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటు బంద్ ప్రకటన.. అటు కొనుగోళ్లు
అక్టోబర్ 29, 30, 31వ తేదీల్లో మోంథా తుపాన్ కారణంగా జిల్లా మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ ప్రకటన విడుదల చేశారు. దీంతో స్లాట్ బుక్ చేసుకున్న రైతులు వాటిని క్యాన్సిల్ చేసుకున్నారు. కానీ, సీసీఐ అధికారి మాత్రం ఆ ప్రకటనలో మాకు సంబంధం లేదంటూ పత్తి కొనుగోలు కేంద్రాన్ని యధావిధిగా కొనసాగించారు. రైతులు పత్తి విక్రయానికి రాకపోయినా.. అయిజ, వడ్డేపల్లి మండలాలకు చెందిన దళారులు మాత్రం తమకు సంబంధించిన వారి స్లాట్లు బుక్ చేసుకొని యథేచ్ఛగా విక్రయాలు కొనసాగిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు రైతులు కేంద్రానికి చేరుకొని ఆరా తీశారు. తమ పత్తిని కొనుగోలు చేయకుండా దళారులు తీసుకొచ్చే పత్తిని మాత్రమే కొనుగోలు చేయడం ఎంత వరకు సమంజసమంటూ ఆందోళన చేశారు. పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఉన్నతాధికారులు స్పందించి ఇబ్బందులు తీర్చాలని కోరారు.
కొర్రీలు పెడుతున్నారు
రూ.లక్షలు పెట్టుబడి పత్తి పంట సాగు చేశాం. కానీ, పత్తిని విక్రయించడానికి సీసీఐ కేంద్రానికి వస్తే తేమ శాతం ఎక్కువుందని తిప్పి పంపుతున్నారు. ప్రత్యేకంగా కూలీలతో పత్తి తీయించి వాహనాన్ని అద్దెకు తీసుకొని కేంద్రానికి వెళ్తే ఇలా కొర్రీలు పెడుతున్నారు. మరోవైపు తీసిన పత్తిని వర్షంలో తడవకుండా కాపాడడం కోసం ఎన్నో కష్టాలు పడాల్సి వస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోలు చేసేలా చూడాలి.
– గిద్దలమ్మ, రైతు, కలుకుంట్ల, మానవపాడు
ఇబ్బందులు లేకుండా చూస్తాం
తుపాన్ కారణంగా ఈ నెల 28న బంద్ చేస్తున్నట్లు ప్రకటన ఇచ్చాం. రైతులు వర్షంలో ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ముందస్తు ప్రకటన చేశాం. చాలామంది రైతులు స్లాట్ క్యాన్సిల్ చేసుకున్నారు. కానీ సీసీఐ అధికారి కేంద్రాన్ని బంద్ చేయలేదు. దళారుల నుంచి పత్తి కొనుగోలు చేస్తున్నారనే విషయం తెలిసింది. ఆరా తీస్తాం. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.
– ఎల్లస్వామి,
మార్కెటింగ్ కార్యదర్శి, అలంపూర్
దళారులదే రాజ్యం
దళారులదే రాజ్యం
దళారులదే రాజ్యం


