
హక్కుల పరిరక్షణకు కదిలిన కార్మిక లోకం
● సార్వత్రిక సమ్మెలో కార్మికుల
నిరసనలు, ర్యాలీలు
గద్వాలటౌన్: హక్కుల పరిరక్షణ కోసం కార్మికులు నడుం బిగించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గద్వాల జిల్లాలో కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె విజయవంతంగా ముగిసింది. బుధవారం జిల్లాలోని సీఐటీయూ, ఏఐటీయూసీ, టీయూసీఐ, ఐఎఫ్‌టీయూలతో పాటు పలు కార్మిక సంఘాలు సమ్మెలో భాగస్వామ్యం అయ్యాయి. నిరసనలు, ర్యాలీలు, ధర్నాలతో హోరెత్తించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానిక పాతబస్టాండ్ చౌరస్తాలో చేపట్టిన ధర్నానుద్ధేశించి సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కోటంరాజు, టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యం మాట్లాడారు. లేబర్ కోడ్ ద్వారా కార్మిక వర్గ హక్కులను కాలరాస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సంఘటిత ప్రతిఘటన పోరాటాల ద్వారా బుద్ది చెబుతామని హెచ్చరించారు. నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలన్నారు. బ్యాంకులు, బీమా, ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటుపరం చేయడాన్ని నిలువరించాలని కోరారు. ఆశా, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు, శానిటరీ, వీఏవో, ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తక్షణమే రెగ్యులర్ చేయాలన్నారు. మోటారు సవరణ చట్టం 2019ని రద్దు చేయాలన్నారు. ఈపీఎస్ కనీస ఫించను రూ.9వేలు ఇవ్వాలని కోరారు. వీటితో పాటు పలు అంశాలను ప్రస్తావించారు. సార్వత్రిక సమ్మెకు బీఆర్‌ఎస్‌తో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు సమ్మెకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో ప్రభాకర్, ఆంజనేయులు, హనుమంతు, వీవీ నర్సింహా, ఉప్పేర్ నర్సింహా, కృష్ణ, రంగన్న, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, గంజిపేట రాజు, పల్లయ్య, వినోద్, అతికూర్ రహమాన్, ప్రవీణ్, హలీం, పద్మ, సునీత, సిద్దయ్య, బీచుపల్లి, శివ, రఘు, శశికళ, పార్వతి పాల్గొన్నారు.