తుదిదశకు ఇన్వెస్టిగేషన్‌ | - | Sakshi
Sakshi News home page

తుదిదశకు ఇన్వెస్టిగేషన్‌

Jun 10 2026 1:49 AM | Updated on Jun 10 2026 1:49 AM

70శాతం పరీక్షలు పూర్తి..

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సాగుతున్న పరీక్షలు

రాత్రివేళల్లోనూ పనులు..

ఈనెల 20కల్లా పూర్తి చేయడానికి ప్రణాళికలు

నేడు మేడిగడ్డకు

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల బరాజ్‌లలో పరిశోధన (ఇన్వెస్టిగేషన్‌) పరీక్షలు తుదిదశకు చేరుకున్నాయి. ఇప్పటిి వరకు 70శాతానికి పైగా పరీక్షలు పూర్తయ్యాయి. సుందిళ్ల బరాజ్‌లో మొత్తం 75 పరీక్షలకు 69 పూర్తికాగా.. అన్నారంలో 66కు 58 పూర్తయ్యాయి. మేడిగడ్డలో 85కు 73 జీపీఆర్‌ పరీక్షలు పూర్తయ్యాయి. బరాజ్‌లలో పరీక్షలను నీటిపారుదల కోఆర్డినేషన్‌ కమిటీ చైర్మన్‌ కల్నల్‌ పరీక్షిత్‌ మెహ్రాతో పాటు టీం స్థితిగతులను సమీక్షిస్తూ పనుల్లో వేగిరం పెంచుతున్నారు. మిగిలిన పరీక్షలు ఈనెల 20వరకు పూర్తి చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఇంజనీర్లు పనిచేస్తున్నారు. మేడిగడ్డ బరాజ్‌కు నేడు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రానున్నారు.

కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన పరిశోధన (ఇన్వెస్టిగేషన్‌) పనులు సుమారు 70శాతం వరకు పూర్తయి.. తుది దశకు చేరినట్లు ఇంజనీర్లు చెపుతున్నారు. కాంక్రీట్‌ నిర్మాణాలపై సమగ్ర నాన్‌ డిస్ట్రక్టివ్‌ టెస్టింగ్‌ (ఎన్‌డీటీ) పరీక్షలు పూర్తి చేశారు. బరాజ్‌, వంతెనల వద్ద కాంక్రీట్‌ నిర్మాణంలో పగుళ్లు, ఖాళీలు, బలహీన ప్రాంతాలు ఉన్నాయా తెలుసుకోవడానికి ఎన్‌డీటీ పరీక్షలు చేశారు. అదే సమయంలో రాఫ్ట్‌ కింద ఉన్న భూగర్భ అసాధారణ పరిస్థితులను గుర్తించి మ్యాపింగ్‌ చేయడానికి గ్రౌండ్‌ పెనెట్రేటింగ్‌ రాడార్‌ (జీపీఆర్‌) సర్వేలు జరుగుతున్నాయి. జీపీఆర్‌ పరికరం ద్వారా రేడియో తరంగాలను భూమి లేదా కాంక్రీట్‌లోకి పంపుతుంది. లోపలి పొరలు, ఖాళీలు, పగుళ్లు, ఇనుప రాడ్ల నుంచి తరంగాలు తిరిగి వస్తాయి. ఆ ప్రతి ధ్వనులను విశ్లేషించి లోపలి నిర్మాణం ఎలా ఉందో తెలుస్తుంది. 20 మెగాహెర్ట్‌ ్జ వరకు తక్కువ ఫ్రీక్వెన్సీ పరిధిలో ఈ సర్వేలు జరుపుతున్నారు. అధునాతన జీపీఆర్‌ వ్యవస్థలు ఇండియాలోనే చాలా అరుదుగా అందుబాటులో ఉన్నాయని ఇంజనీర్లు అంటున్నారు. నిర్మాణానికి ముందు చేపట్టిన అధ్యయనాల సమాచారాన్ని ధృవీకరించేందుకు వ్యూహాత్మకంగా బోర్‌హోల్‌ పరిశోధనలు నిర్వహించారు. తాజాగా వేసిన బోర్‌హోల్‌ పరీక్షల ఫలితాలు నిర్మాణానికి ముందు చేసిన పరిశోధనలతో అనుగుణంగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది. భూగర్భ పరిస్థితులపై మరింత స్పష్టత కోసం 80 మీటర్ల లోతు వరకు అదనపు బోర్‌హోల్‌ డ్రిల్లింగ్‌ చేపట్టి, బెడ్‌ రాక్‌ స్థాయిలు, అడుగుభాగన భౌగోళిక నిర్మాణాలను అధ్యయనం చేస్తున్నారు. పునరుద్ధరణ రూపకల్పనకు అవసరమైన నమ్మకమైన డేటా సేకరణ కోసం భూగర్భ మట్టి దృఢత్వం, సాంద్రత, భరించే సామర్థాఽన్ని తెలుసుకోవడానికి ప్రమాణికంగా స్టాండర్డ్‌ పెనెట్రేషన్‌ టెస్టులు (ఎస్‌పీటీ) చేస్తున్నారు. నీటి పారగమ్యత (పర్మియబిలిటీ) పరీక్షలు నిర్వహించారు. గోదావరి నది ఒడ్డున గరిష్ట వరద మట్టం (ఎంఎఫ్‌ఎల్‌) వరకు తాజా టోపోగ్రాఫికల్‌, సర్వే వివరాలను సేకరించారు. ఇవి మెరుగైన హైడ్రాలిక్‌ మోడలింగ్‌ అధ్యయనాలకు ఉపయోగపడనున్నాయని తెలిసింది.

45 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతున్న తీవ్ర ఉష్ణోగ్రతలు, నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరత వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, రాత్రి వేళల్లో కూడా పని గంటలను పొడిగిస్తూ ప్రాజెక్టు బృందాలు పనులను నిరంతరంగా కొనసాగిస్తున్నాయి. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని రూపకల్పన చేశారు. హైడ్రాలిక్‌ మోడలింగ్‌ పూర్తి చేయడానికి వినియోగించనున్నారు. తుది పునరుద్ధరణ డిజైన్ల అమలుకు ముందు ఎన్‌డీఎస్‌ఏ, సీడబ్ల్యూసీ పరిశీలించి ఆమోదించనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement