చిల్పూరు/జఫర్‌గఢ్: కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. జనగామ జిల్లా చిల్పూరు మండలంలోని పల్లగుట్ట గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి హాజరయ్యారు. తొలుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య, కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్, ఎన్పీడీసీఎల్ సీఎండీ కె.వరుణ్‌రెడ్డి, చిల్పూరు ఆలయ చైర్మన్ శ్రీధర్‌రావు, స్థానిక సర్పంచ్ నర్సింహారెడ్డి డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. స్టేషన్‌ఘన్‌పూర్ ప్రాంతం ఒకప్పుడు వలసలకు కేరాఫ్‌గా ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవన్నారు. నియోజకవర్గంలో దేవాదుల ప్రాజెక్టు, రిజర్వాయర్ల ద్వారా పంటలకు నీరు అందడం, పెరిగిన వ్యవసాయ పంపుసెట్ల వల్ల పంట దిగుబడులు పెరిగి రైతుల ఆదాయం పెరిగి వలసలు తగ్గాయన్నారు. ఏ ప్రాంతంలో నీరు ప్రవహించాల న్నా, ఇతర అవసరాలకూ విద్యుత్ అవసరమని, అందుకు విద్యుత్ వ్యవస్థను నిరంతరం ఆధునీకరిస్తున్నామన్నారు. నియోజకవర్గ సమస్యలను ఎమ్మెల్యే శ్రీహరి తన దృష్టికి తీసుకొచ్చారని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు
పల్లగుట్ట గ్రామంలో రూ.60.62 కోట్లతో చేపట్టిన 4 విద్యుత్ సబ్‌స్టేషన్ల ప్రారంభం, 3 సబ్‌స్టేషన్ల శంకుస్థాపనల శిలాఫలకాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి ఎరువుల షాపులు, దివ్యాంగులకు సంబంధించిన స్టాళ్లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రూ.3.5 కోట్ల విలువైన సీ్త్రనిధి చెక్కులు అందజేశారు. 107 స్వయం సహాయక సంఘాల మహిళలకు సీ్త్రనిధు రుణాల కింద రూ.3.07 కోట్లు, బ్యాంకు లింకేజీ కింద 407 స్వయం సహాయక సంఘాలకు రూ.32.89కోట్ల విలువైన చెక్కులను మహిళలకు అందించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు యశస్వినిరెడ్డి, నాగరాజు, నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రూపాషా, కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఐఆర్ పేరుతో బీజేపీ కుట్ర: ఎంపీ కావ్య
ఓటు హక్కుపై ఎస్‌ఐఆర్ పేరుతో బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని ఎంపీ కడియం కావ్య అన్నారు. 10 ఏళ్లుగా అబివృద్ధిలో చీకట్లో మగ్గిపోయిన స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం కడియం నాయకత్వంలో మోడల్ నియోజకవర్గంగా రూపుదిద్దుకుంటున్నట్లు తెలిపారు.
నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం:
ఎమ్మెల్యే కడియం శ్రీహరి
వ్యవసాయ, గృహ అవసరాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు.రఘునాథపల్లిలో ఉన్న 132/ 33 కేవీ సబ్ స్టేషన్‌ను 220/133 కేవీ సబ్ స్టేషన్‌గా అప్‌గ్రేడ్ చేయాలని, ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ లైన్లను తొలగించేందుకు నిధులు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎంను కోరారు.
సాగునీటి వసతులతో
ఘన్‌పూర్‌లో వలసలు తగ్గాయి
పల్లగుట్ట సభలో డిప్యూటీ సీఎం
భట్టి విక్రమార్క
రూ.60.62 కోట్లతో 4 సబ్‌స్టేషన్ల
ప్రారంభం, 3 సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన


