ఇందిరమ్మ ఇళ్లను త్వరితగతిన పూర్తిచేయాలి
● అదనపు కలెక్టర్ విజయలక్ష్మి
భూపాలపల్లి రూరల్: ఇందిరమ్మ ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి లబ్ధిదారులకు సూచించారు. భూపాలపల్లి మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల ప్రగతిని పరిశీలించేందుకు శనివారం అదనపు కలెక్టర్ విజయలక్ష్మి రాంపూర్, గొల్ల బుద్దారం గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో ఆమె మాట్లాడి ఇళ్ల నిర్మాణ పనుల పురోగతి, గృహ నిర్మాణ బిల్లుల చెల్లింపు వివరాలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి అర్హుడికి సొంత గృహం అందించే కార్యక్రమం విజయవంతం కావాలంటే అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ సెంటర్, గొల్లబుద్దారం ఎస్టీ హస్టల్‌ను తనిఖీ చేసి లోటుపాట్లను సరిదిద్దుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంట ఎంపీడీఓ తరుణి ప్రసాద్, ఎంపీఓ నాగరాజు, పంచాయతీ కార్యదర్శి దేవేందర్, ఇతర అధికారులు ఉన్నారు.


