58 కి.మీ.. 32 మలుపులు..
కాటారం: కాళేశ్వరం నుంచి మొదలుకొని భూపాలపల్లి వరకు 58 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి 353(సి) విస్తరించి ఉంది. జిల్లాలోని కాళేశ్వరం, మహదేవపూర్, కాటారం, భూపాలపల్లి, గణపురం మీదుగా వెళ్తుంది. ఈ రహదారి వెంట సుమారు 32 వరకు మలుపులు ఉన్నాయి. పేరుకే జాతీయ రహదారి అయినప్పటికీ మలుపు వద్ద ఎక్కడ కూడా సూచిక బోర్డులు లేవు. కాళేశ్వరం నుంచి భూపాలపల్లి వరకు జాతీయ రహదారి నిర్మాణం పూర్తయి ఏళ్లు గడుస్తున్నప్పటికీ అధికారులు మాత్రం సూచిక బోర్డులు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అటవీ ప్రాంతంలో అనేక ప్రమాదకరమైన మలుపులు ఉండటంతో హెచ్చరిక బోర్డులు లేని కారణంగా నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. మలుపుల వద్ద పిచ్చిమొక్కలు ఏపుగా పెరగడం ప్రమాదాలకు మరో కారణంగా నిలుస్తుంది.
నిత్యం వాహనాల రద్దీ..
అంతర్రాష్ట్ర జాతీయ రహదారి కావడంతో పాటు కాళేశ్వరం పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్లే భక్తులు, మేడిగడ్డ ప్రాజెక్ట్, పంప్‌హౌస్ వద్దకు సామగ్రి తీసుకెళ్లే భారీ వాహనాలు, ఇసుక, బొగ్గు లారీల రాకపోకలతో ఈ రహదారి వెంట వాహనాల రద్దీ తీవ్రంగా పెరిగిపోయింది. మహారాష్ట్ర వైపు వెళ్తే గూడ్స్ వాహనాలు, సాధారణ వాహనాలు, నిత్యం వందలాది ఇసుక, ఇతర సామగ్రితో లారీలు వస్తుపోతుండటంతో సాధారణ వాహనదారులు ఈ రహదారి గుండా ప్రయాణించడం నరకప్రాయంగా మారిపోయింది. రోజురోజుకూ వాహనాల రాకపోకలు ఎక్కువ అవుతుండటంతో ప్రమాదాలు సైతం అధికంగా పెరిగిపోతున్నాయి. రహదారి వెంట జరిగే ప్రమాదాల్లో అధిక శాతం మలుపుల వద్దనే జరుగుతుండటం గమనార్హం. ఇప్పటికై నా అధికారులు స్పందించి మలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు, ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
అత్యంత ప్రమాదకర మలుపులు..
● కాళేశ్వరం సమీపంలోని అన్నారం క్రాస్
● కుదురుపల్లి–అన్నారం క్రాస్ అటవీ ప్రాంతంలో మూడు మలుపులు
● మహదేవపూర్ మండల కేంద్రానికి సమీపంలోని నర్సరీ వద్ద
● మహదేవపూర్–కాటారం మధ్యలో బొమ్మాపూర్ క్రాస్
● చింతకాని క్రాస్ వద్ద
● మేడిపల్లి అటవీ ప్రాంతంలో
● భూపాలపల్లి సమీపంలోని కమలాపూర్ క్రాస్ వద్ద
జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదాలు..
● మే 8న కాటారం మండల కేంద్రం సమీపంలో చింతకాని క్రాస్ వద్ద ఇసుక లారీని బైక్ ఢీ కొట్టడంతో మండలంలోని ధన్వాడకు చెందిన తుల్సెగారి రాజలింగు మృతి చెందాడు.
● మే 23న కాటారం మేడిపల్లి అటవీ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిట్యాల మండలం కుమ్మరిపల్లికి చెందిన పాల రజిత, విష్ణు మృతిచెందారు. తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.
● మే 25న కాటారం మండలం నస్తూర్‌పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సూర్యాపేట జిల్లాకు చెందిన సకోటి లలిత అనే వృద్ధురాలు మృతి చెందింది.
● జూన్ 27న మహదేవపూర్ మండల కేంద్రానికి సమీపంలో అయ్యప్ప స్వామి ఆలయం వద్ద బైక్ అదుపుతప్పి పడిపోవడంతో కాటారం మండల కేంద్రానికి చెందిన కొడపర్తి సమ్మయ్య మృతి చెందాడు.
● సెప్టెంబర్ 29న కాటారం మండలం సబ్‌స్టేషన్‌పల్లి సమీపంలో బస్సు ఢీ కొనడంతో మాచెర్ల మల్లేశ్ తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు.
● అక్టోబర్ 1న కాటారం మండలం మేడిపల్లి అటవీ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాటారం మండలం కొత్తపల్లికి చెందిన తైనేని శ్రీనివాస్ మృతి చెందాడు.
ప్రమాదకరంగా 353(సి)
జాతీయ రహదారి
మలుపుల వద్ద కానరాని సూచికబోర్డులు
రోజురోజుకూ పెరిగిపోతున్న ప్రమాదాలు
పట్టించుకోని ఎన్‌హెచ్ అధికారులు
లారీల కారణంగా 74
ద్విచక్ర వాహనాలు 65
ఇతర వాహనాలు 41
పట్టించుకోవట్లే..
జాతీయ రహదారిపై మలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. నిత్యం అనేక మంది ప్రమాదాల భారిన పడుతున్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. పేరుకే జాతీయ రహదారి కానీ నిర్వహణ ఏ మాత్రమూ లేదు. అక్కడక్కడ మలుపుల వద్ద పిచ్చి మొక్కలు సైతం ఏపుగా పెరిగి ఇబ్బందిగా మారాయి. అధికారులు వెంటనే స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి
– రామిళ్ల రాజబాబు, కాటారం
ప్రతిపాదనలు పంపించాం..
జాతీయ రహదారి దెబ్బతిన్న చోట మరమ్మతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అనుమతులు రాగానే పనులు చేయిస్తాం. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటాం.
– కిరణ్, డీఈఈ,
నేషనల్ హైవే అథారిటీ
58 కి.మీ.. 32 మలుపులు..
58 కి.మీ.. 32 మలుపులు..


