గల్లంతైన యువతి మృతదేహం లభ్యం
జఫర్‌గఢ్: రెండు రోజుల క్రితం జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం కోయినాచలం గ్రామ శివారులోని బోల్లమత్తడి వద్ద వరద ఉధృతిలో గల్లంతైన యువతి మృతదేహం లభ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం.. వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటకు చెందిన బక్క శ్రావ్య (19), రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నకర్తమేడెపల్లికి చెందిన బరిగెల శివకుమార్ (ప్రేమికులు) బుధవారం రాత్రి బైక్‌పై జఫర్‌గఢ్ మండలం కోనాయిచలం వస్తుండగా మార్గమధ్యలో బోల్లమత్తడి వద్ద వరద ఉధృతిలో పడ్డారు. చెట్టు కొమ్మల సాయంతో శివకుమార్ ప్రాణంతో బయటపడగా శ్రావ్య వరదలో కొట్టుకుపోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల ద్వారా గాలింపు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. చివరకు శుక్రవారం ఉదయం శ్రావ్య మృతదేహం నీటిపై తేలింది. గమనించిన పోలీసులు వెంటనే ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలకు సమాచారం అందించగా వారు మృతదేహాన్ని వరద నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఘటనాస్థలి వద్ద కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామారావు తెలిపారు.


