చేజారిన పంట
శనివారం శ్రీ 1 శ్రీ నవంబర్ శ్రీ 2025
నిండా ముంచిన మోంథా తుపాను
● జిల్లాలో సుమారు 10 వేల ఎకరాల్లో పంట నష్టం
● అధికారుల అంచనా ప్రకారం 3,704 ఎకరాలే..
● పత్తి, మిర్చి, వరికి కోలుకోలేని దెబ్బ
● ఆందోళనలో అన్నదాతలు
భూపాలపల్లి: మోంథా తుపాను జిల్లా రైతులను నిండా ముంచింది. పంటలు చేతికొచ్చే సమయంలో కురిసిన వానలతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. పత్తి, మిర్చి, వరిపంటలు తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం పంటనష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని వేడుకుంటున్నారు.
జిల్లాలోని 12 మండలాల్లోని రైతులు పత్తి 98,260 ఎకరాలు, వరి 1,14,653, మిర్చి 22 వేల ఎకరాల్లో సాగు చేశారు. పత్తిపంట సాగు చేసిన రైతులకు ఆది నుంచి కష్టాలే ఎదురవుతున్నాయి. గింజలు నాటాక సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రెండు, మూడుసార్లు గింజలు కొనుగోలు చేసి పోగుంటల్లో విత్తాల్సిన పరిస్థితి నెలకొంది. అనంతరం పత్తి పూత, కాత దశలో ఉన్న సమయంలో సెప్టెంబర్ 28, 29 తేదీల్లో వర్షాలు కురిశాయి. దీంతో ఏరేదశలో ఉన్న పత్తి నల్లబారింది. కాయలు మురిగిపోయాయి. పూత రాలిపోయింది. దీంతో ఉన్న పంటను కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే మోంథా తుపాను రావడంతో ఉన్న పంట సైతం పూర్తిగా దెబ్బతింది. కాయలు, పూత రాలిపోవడంతో అయోమయంలో పడ్డారు. చేసేదిలేక పత్తిపంటను పూర్తిగా తొలగించి మొక్కజొన్న సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
మిగతా జిల్లాలతో పోలిస్తే తుపాను ప్రభావం జయశంకర్ జిల్లాపై తక్కువగానే చూపింది. తుపాను కారణంగా బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు వర్షం కురిసింది. పత్తి, మిర్చి, వరిపంటలు దెబ్బతిన్నాయి. వర్షం, ఈదురుగాలులకు మిర్చి మొక్కలు, వరిపైరు నేలవాలింది. కాగా, జిల్లా అధికారులు దెబ్బతిన్న పంటలను పూర్తిస్థాయిలో పరిశీలించలేదని తెలుస్తోంది. గురువారం ఒక్కరోజు క్షేత్రస్థాయి పర్యటనలు చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపారు. జిల్లాలోని ఆరు మండలాల్లోని 59 గ్రామాలకు చెందిన 2,524 మంది రైతుల పత్తి, వరి పంటలు 3,704 ఎకరాల్లో దెబ్బతిన్నట్లుగా వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. కాగా అధికారులు పూర్తి స్థాయిలో క్షేత పర్యటన చేస్తే పంటనష్టం అంచనా పెరిగే అవకాశం ఉందని ప్రజలు, రైతులు అభిప్రాయపడుతున్నారు.
జిల్లాలో ఉద్యానవనశాఖకు సంబంధించి 54 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. రేగొండ మండలంలో 25, గోరికొత్తపల్లి మండలంలో 24 ఎకరాల్లో మిర్చిపంట, రేగొండ మండలంలో 3 ఎకరాలు, గోరికొత్తపల్లిలో రెండెకరాల్లో అరటి పంటకు నష్టం వాటిల్లినట్లు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు జిల్లా ఉద్యానవనశాఖ అధికారి సునీల్ వెల్లడించారు. కాగా కాటారం డివిజన్ పరిధిలోని మహదేవపూర్, కాటారం మండలాల్లో సైతం మిర్చి పంట పాక్షికంగా దెబ్బతింది.
మండలం వరి పత్తి మొత్తం
టేకుమట్ల 1,445 4 1,449
కొత్తపల్లిగోరి 106 0 106
మల్హర్ 289 0 289
చిట్యాల 150 0 150
మొగుళ్లపల్లి 1,341 0 1,341
మహదేవపూర్ 180 189 369
మొత్తం 3,511 193 3,704
చేజారిన పంట
చేజారిన పంట
చేజారిన పంట
చేజారిన పంట


