కోర్టులకు కొత్త భవనాలు
● జిల్లా కోర్టు సముదాయానికి నిధులు
● నేడు హైకోర్టు జడ్జి చేతుల మీదుగా
శంకుస్థాపన
భూపాలపల్లి అర్బన్: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జిల్లా న్యాయస్థానాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే తాత్కాలిక భవనాల్లో వసతులు లేకపోవడంతో సొంత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించి.. న్యాయ నిర్మాణ్ ప్రణాళికలో భాగంగా జిల్లా న్యాయస్థానాల భవనాల నిర్మాణానికి రూ.81 కోట్లు కేటాయించింది. నేడు (శనివారం) హైకోర్టు జడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. జిల్లాలో 2020లో కోర్టులు ఏర్పాటుకాగా.. ఐదేళ్లుగా అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. కోర్టుల సంఖ్య 12కి పెరిగినా సొంత భవనాలు లేకపోవడంతో న్యాయవాదులు, న్యాయమూర్తులు ఇబ్బందులుపడ్డారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు హైకోర్టు జిల్లా కోర్టు భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
రూ.81 కోట్లతో ఆధునిక భవనాలు..
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిధులతో కోర్టు భవనాలు నిర్మించనున్నారు. ఇందులో 60 శా తం కేంద్రం, 40 శాతం రాష్ట్రం నిధులను భరిస్తా యి. జిల్లా కోర్టు సముదాయానికి రెవెన్యూ అధికా రులు 11.20 ఎకరాల భూమిని కృష్ణకాలనీ సమీ పంలో కేటీకే 6వ గని వద్ద కేటాయించారు. ఈ భవనాలు నాలుగు అంతస్తులతో, సెల్లార్‌తో ఆధునిక డిజైన్‌లో నిర్మిస్తారు. సెల్లార్‌లో 88 కార్లు, 62 ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఉంటుంది. ప్రతీ అంతస్తు 43 వేల నుంచి 44 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో, మొత్తం కోర్టు భవనం 2,87,743.58 చదరపు అడుగులు ఉండేలా నిర్మించనున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో రెండు అంతస్తుల నిర్మాణానికి సిద్ధంగా ఉండేలా డిజైన్ చేశారు. ఈ భవనంలో ఫ్యామిలీ, పోక్సో కోర్టులు కూడా ఏర్పాటు చేస్తారు.
2027 నాటికి పూర్తి
నేడు హైకోర్టు జడ్జి చీఫ్ జస్టిస్ అపరేష్‌కుమార్‌సింగ్ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనుండగా.. హైకోర్జు జడ్జిలు ఈవీ వేణుగోపాల్, నామవరపు రాజేశ్వర్‌రావు పాల్గొననున్నారు. ఇప్పటికే కోర్టు భవనాల నిర్మాణ టెండర్ ప్రక్రియ పూర్తయింది. పనులు ప్రారంభమైన 24 నెలల్లో పూర్తిచేయాలని ఉన్నత న్యాయస్థానం లక్ష్యంగా నిర్ధారించింది. ఈ భవనాలు ఆధునిక సౌకర్యాలతో, తూర్పు అభిముఖంగా, విశాలమైన గాలి, వెలుతురు సౌకర్యాలతో నిర్మిస్తారు. నిర్మాణానికి సంబంధించిన మోడల్ స్టక్చ్రర్ ఇప్పటికే సిద్ధమైంది.


