భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి
● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి: చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ రాహు ల్ శర్మ అధికారులను ఆదేశించారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పంట కాలువల నిర్మాణానికి భూసేకరణ, ఎంజాయ్‌మెంట్ సర్వేపై శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, ఇరిగేషన్, మెగా కంపెనీ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కెనాల్స్ నిర్మాణానికి మొత్తం ఎంత మంది రైతుల భూములు ప్రభావితం అవుతున్నాయి.. ఎన్ని ఎకరాల భూమి అవసరం అవుతుందనే అంశాలపై నివేదికలు సిద్ధం చేయాలన్నారు. రైతులకు పరిహారమందించే ప్రక్రి య పారదర్శకంగా చేపట్టాలని తెలిపారు. రైతులతో చర్చలు జరిపి, భూసేకరణకు సంబంధించిన సమాచారం స్పష్టంగా వివరించాలని చెప్పారు. రెవెన్యూ రికార్డుల్లో వచ్చే మార్పులను సమన్వయంతో నమోదు చేయాలని సూచించారు.
దేశ సమగ్రతను కాపాడాలి
సర్ధార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో ప్రతీ ఒక్కరు దేశ సమగ్రతను కాపాడాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. పటేల్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమానికి ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి కలెక్టర్ పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు.
ప్రభుత్వం రైతులను ఆదుకుంటుంది
టేకుమట్ల: వర్షాలకు తడిసిన ధాన్యం, దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం పరిహారం అందిస్తుందని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. మండల కేంద్రంతోపాటు, మండలంలోని కుందనపల్లి, ఎంపేడులో తుపానుతో దెబ్బతిన్న పంటలను శుక్రవారం ఆయన పరిశీలించారు.


