బదిలీల జోష్‌! | - | Sakshi
Sakshi News home page

బదిలీల జోష్‌!

Published Fri, Jun 14 2024 2:12 AM | Last Updated on Fri, Jun 14 2024 2:12 AM

బదిలీల జోష్‌!

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

ప్రభుత్వశాఖల్లో బదిలీల జోష్‌ కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక చేపట్టాల్సిన ట్రాన్స్‌ఫర్లు వివిధ కారణాలతో ఆగిపోయాయి. ప్రజాపాలనపై తమ ముద్ర వేసుకోవాలనుకున్నా.. అసెంబ్లీ ఎన్నికల వెంటనే లోక్‌సభ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం వల్ల సాధ్యం కాలేదు. ఉమ్మడి వరంగల్‌లో అక్కడక్కడా కొన్ని బదిలీలు జరిగినా.. అవి కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు, మార్గదర్శకాల మేరకు అనివార్యమయ్యాయి. ఈనెల 6తో ఎన్నికల కోడ్‌ తొలగిపోగా.. అదేరోజు నుంచి పాలనపై దృష్టి సారించిన ప్రభుత్వం బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో పోలీసు, రెవెన్యూ తదితర శాఖల అధికారులు కోరుకున్నచోట పోస్టింగ్‌లు కొట్టేందుకు ప్రజాప్రతినిధుల లేఖలు సంపాదించి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అలాగే నీటిపారుదల, వైద్య ఆరోగ్యశాఖ, అటవీశాఖలలో దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న వారికి సైతం స్థానచలనం కల్పించేందుకు జాబితా సమర్పించాలని గురువారం ఆయాశాఖ అధికారులకు ఆదేశాలు అందాయి.

పది రోజుల్లో ప్రక్రియ పూర్తయ్యేలా...

బదిలీల ప్రక్రియ పది రోజుల్లో పూర్తయ్యేలా ఆయా శాఖల ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు యూనిట్లు, డివిజన్లు, సర్కిళ్ల వారీగా జాబితాను ఇవ్వాలని సర్క్యులర్‌ జారీ చేశారు. ఒక్కడుగు ముందుకేసిన పోలీసుశాఖ ఉన్నతాధికారులు మూడు రోజుల కిందటే మల్టీజోన్‌–1 పరిఽధిలో 13 మంది ఇన్‌స్పెక్టర్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వారం రోజులలోపే సబ్‌ఇన్‌స్పెక్టర్‌ నుంచి జిల్లాస్థాయి వరకు పలువురు అధికారుల బదిలీ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. నీటిపారుదలశాఖకు సంబంధించి ఉమ్మడి వరంగల్‌లో రెండు సర్కిళ్లు, ఇద్దరు చీఫ్‌ ఇంజనీర్లు ఉండగా.. ములుగు సర్కిల్‌కు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు, వరంగల్‌ సర్కిల్‌ కిందకు 9 నియోజకవర్గాలు వస్తాయి. ఈ రెండు సర్కిళ్ల పరిధిలో సుమారుగా 40కిపై డివిజన్లు, సబ్‌ డివిజన్లున్నాయి. వీటిలో కొందరు ఎస్‌ఈలు, ఈఈలు, డిప్యూటీ ఈఈలు ఇన్‌చార్జ్‌లుగా పనిచేస్తుండగా.. చాలామంది దీర్ఘకాలికంగా పనిచేస్తున్న వారు ఉన్నారు. దీంతో బదిలీల ప్రక్రియలో భాగంగా ఈ ఏడాది మే31న ప్రొపార్మాలో సూచించిన ప్రకారం లాంగ్‌స్టాండింగ్‌లో పనిచేస్తున్న టీఐఈఎస్‌ఎస్‌ (టెక్నికల్‌ అసిస్టెంట్‌ నుంచి టెక్నికల్‌ ఆఫీసర్‌ వరకు) కేడర్‌ వివరాలు హెడ్‌క్వార్టర్స్‌ వారీగా పంపించాలని ఇరిగేషన్‌ ఈఎన్‌సీ (అడ్మిన్‌) గుమ్మడి అనిల్‌కుమార్‌ గురువారం యూనిట్‌ ఆఫీసర్లను ఆదేశించారు. ఈనెల 20లోగా తనకు జాబితాను మెయిల్‌ ద్వారా అందించాలని సూచించారు. అదే విధంగా వైద్య ఆరోగ్య, అటవీ, రెవెన్యూశాఖల్లోనూ బదిలీల ప్రక్రియపై కసరత్తు వేగంగా సాగుతోంది.

డిప్యుటేషన్ల దందాకు తెరపడేనా..!

వైద్య, ఆరోగ్యం సహా పలు శాఖల్లో ఏళ్ల తరబడిగా గత ప్రభుత్వం బదిలీలను నిలిపి వేసింది. ముఖ్యంగా వైద్య ఆరోగ్యశాఖలో వివిధ కేడర్‌లకు చెందిన పలువురు ‘డిప్యుటేషన్‌’ల పేరిట కోరుకున్నచోట కొలువు చేసే దందాకు తెరతీశారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక డిప్యుటేషన్లను రద్దు చేసింది. హనుమకొండ, వరంగల్‌, జనగామ, జేఎస్‌ భూపాలపల్లి జిల్లాల్లో ఏఎన్‌ఎం నుంచి డీఎంహెచ్‌ఓ వరకు వివిధ కేడర్‌లలో పనిచేస్తున్న పలువురికి స్థానచలనం కలిగింది. తప్పనిసరి అనుకున్న చోట కొందరు డీఎంహెచ్‌ఓలను కొత్త ఉత్తర్వులతో కొనసాగించారు. ఇంత జరిగాక కూడా వివిధ విభా గాల్లోని 16 మంది ఉద్యోగులను డిప్యుటేషన్లకు అనుమతివ్వాలని కోరుతూ జనగామ జిల్లా వైద్యాధికారులు కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా దగ్గర పైరవీ చేయ డం కూడా అప్పట్లో వివాదాస్పదమైంది. తాజాగా వైద్యశాఖ పరిధిలోని ప్రజారోగ్య, వైద్య విధానపరిషత్‌, విద్య డైరక్టరేట్‌ల కింద పనిచేసే సిబ్బంది, అధికారుల బదిలీలకు కసరత్తు జరుగుతోందని ప్రకటన వెలువడింది. దీంతో ఉమ్మడి వరంగల్‌లోని అన్ని కేడర్‌లలో పనిచేస్తున్న సుమారు 491 మందికి స్థానచలనం కలిగే అవకాశం ఉంది. ఈ సంఖ్య పెరగవచ్చని కూడా అధికారులు చెబుతున్నారు. కాగా ఈసారి బదిలీల్లో ఉద్యోగులకు ఇబ్బంది కలిగించేలా గత ప్రభుత్వ హయాంలో విడుదలైన 317 జీఓపై స్పష్టత ఇవ్వాలని ఉద్యోగులు, ఉద్యోగసంఘాల నాయకులు కోరుతున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు, స్థానికత ఆధారంగా వెలువడిన ఉత్తర్వులను పక్కనపెట్టి ఉద్యోగి హోదా, సీనియారిటీ అని చెప్పి అడిగిన ప్రాధాన్యతలలో ఏదీ వర్తించలేదంటున్నారు. ఉద్యోగికి ఫస్ట్‌ ప్రిఫరెన్స్‌, సెకండ్‌ ప్రిఫరెన్సన్నా రాకపోగా, ఆయా జిల్లాల్లో ఉన్న అన్ని పోస్టులను నింపకుండా కొన్ని ఫ్రీజ్‌ చేసి సుదూర ప్రాంతాల్లో ఉన్న జిల్లాలకు పంపించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈసారి నిర్వహించే బదిలీల ప్రక్రియలో అన్ని కేడర్‌ల ఉద్యోగులు, అధికారులకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. ఈ బదిలీల ప్రక్రియతోనైన వైద్య, ఆరోగ్యశాఖలో డిప్యుటేషన్ల దందాకు తెరపడుతుందా? అన్న చర్చ కూడా జరుగుతోంది.

ప్రభుత్వశాఖల్లో బదిలీల సందడి.. పోలీసుశాఖలో మొదలు

వైద్య, ఆరోగ్యశాఖపై నివేదికలు సిద్ధం

‘ఇరిగేషన్‌’లో లాంగ్‌స్టాండింగ్‌లపై ఆరా...

అన్ని శాఖల్లో బదిలీలపై

సాగుతున్న కసరత్తు

దీర్ఘకాలికంగా ఒకేచోటున్న వారికి స్థానచలనం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement