జనగామ రూరల్: జిల్లా కేంద్రంలో యంగ్ ఇండియా స్కూల్, కాకతీయ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయాలని మంగళవారం నాగరత్న సేవా సంఘం అధ్యక్షుడు బిర్రు ఇస్తారి హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజావాణిలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చెన్నారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. కళాశాలల మంజూరు విషయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
స్పోర్ట్స్‌కోటాలో పారాస్పోర్ట్స్
క్రీడాకారులను చేర్చాలి
జనగామ: స్పోర్ట్స్ కోటాలో పారాస్పోర్ట్స్ క్రీడాకారులను చేర్చాలని పారా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఉపాధ్యక్షురాలు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ జనగామ జనరల్ సెక్రటరీ మాచర్ల కృష్ణవేణి కో రారు. మంగళవారం ఆమె జిల్లా కేంద్రంలో మాట్లాడారు.. నూతన పాలసీ వచ్చి పది నెలలు గడుస్తున్నప్పటికీ పారాస్పోర్ట్స్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించకపోవడం బాధాకరమన్నారు. హైకోర్టు 2023లో ఇచ్చిన తీర్పుకు రెండు శాతం పారాస్పోర్ట్స్ క్రీడాకారులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని కోరారు.
పాఠశాలల కుదింపు
ఉపసంహరించుకోవాలి
జనగామ రూరల్: పాఠశాలల కుదింపు ఆలోచనలను ఉపసంహరించుకోవాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.శ్రీనివాస్ ప్రభుత్వానికి సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఉమాపతి భవన్‌లో జిల్లా అధ్యక్షుడు ఎన్‌ఎన్ రాజు అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈసందర్భంగా డి.శ్రీనివాస్ మాట్లాడుతూ.. రేషనలైజేషన్ ద్వారా 27 వేల ప్రభుత్వ పాఠశాలను 4 వేల పాఠశాలకు కుదించడం వల్ల పేదలు విద్యకు దూరమవుతారన్నారు. ప్రజలకు విద్యను దూరం చేస్తామంటే పాఠశాలల పరిరక్షణ కోసం ప్రజలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సంఘటితమై పోరాడాలని తెలిపారు. బి.లక్ష్మ య్య, కుర్రంల యాదగిరి, అంకుషావలి, వజ్రయ్య, తోటరాజు, రాజారెడ్డి, లక్ష్మణ్ జి, వెంకన్న ,రాజేంద్ర కుమార్, మల్లారెడ్డి ,కనకయ్య, శ్రీహరి, దూడల రమేశ్, శ్రీనివాస్, ఖాసిం, వసంత, రామచంద్రం పాల్గొన్నారు
ప్రకృతి పరిరక్షణకు
ట్రెక్కింగ్ ఊతం
రఘునాథపల్లి: ప్రజా పాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రఘునాథపల్లి దొడ్గిగుట్టపై ట్రెక్కింగ్ కార్యక్రమం నిర్వహించారు. ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ అవగాహన పెంపొందించడం, యువతలో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమంలో గ్రామస్తులు, ప్రకృతి ప్రేమికులు, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ట్రెక్కింగ్ ప్రకృతి పరిరక్షణకు ఊతమన్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ భాస్కర్, రమేశ్, జావేద్, హుస్సేన్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శోభారాణి, బీట్ ఆఫీ సర్లు రమేష్, రవి, అంజయ్య పాల్గొన్నారు.
ఆర్టీసీ డిపో మేనేజర్‌గా ఉష
జనగామ: జనగామ ఆర్టీసీ డిపో మేనేజర్‌గా ఎం.ఉషను నియమిస్తూ ఆర్టీసీ ఎండీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న ఎస్.స్వాతి హైదరాబాద్ చెంగిచెర్ల డిపోకు బదిలీ కాగా, షాద్‌నగర్‌లో పని చేస్తున్న ఉషకు ఇక్కడకు పోస్టింగ్ ఇచ్చారు.
కరపత్రం ఆవిష్కరణ
హన్మకొండ కల్చరల్: వరంగల్ రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగే 17వ జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు– 2026 కరపత్రాన్ని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మంగళవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, రాష్ట్ర చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ హైదరాబాద్, ఐక్యవేదిక పరపతి సంఘం సభ్యుల సహకారంతో ఈ నెల 12, 13, 14వ తేదీల్లో కాళోజీ కళాక్షేత్రంలో ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహించనున్నారు.


