జనగామ: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఆర్టీసీ బస్సుల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించడం ముందడుగుగా నిలుస్తోంది. ఈ పథకం ద్వారా మహిళా సంఘాలు స్థిరమైన ఆదాయ వనరులను పొందడంతో పాటు నిర్వహణ సామర్థ్యాలను పెంపొందించుకునే అవకాశం లభిస్తోంది.
స్వల్ప పెట్టుబడి.. స్థిర ఆదాయం
జిల్లాలోని 12 మండల సమాఖ్యలతో పాటు జిల్లా సమాఖ్యకు కలిపి మొత్తం 13 బస్సులను ప్రభుత్వం కేటాయించింది. ఒక్కో బస్సు కొనుగోలుకు సుమారు రూ.36 లక్షల వ్యయం కాగా, అందులో ప్రభుత్వం రూ.30 లక్షలు భరిస్తుండగా, సంబంధిత సమాఖ్య రూ.6 లక్షలు మాత్రమే పెట్టుబడిగా సమకూరుస్తోంది. ఈ బస్సులను ఆర్టీసీ సంస్థ నిర్వహణలో నడిపిస్తూ, మహిళా సమాఖ్యలకు ప్రతీ నెల రూ.69,468 చొప్పున చెల్లించనుంది. 84 నెలల కాలంలో ఒక్కో బస్సుకు దాదాపు రూ.58.80 లక్షల మేర ఆదాయం మహిళా సంఘాలకు లభించనుంది. స్వల్ప పెట్టుబడితో దీర్ఘకాలిక ఆదాయాన్ని అందించే ఈ విధానం మహిళా సంఘాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంలో కీలకంగా మారనుంది. ప్రభుత్వం రూ.30 లక్షల సబ్సిడీ అందించగా, మహిళా సమాఖ్యలు కేవలం రూ.6 లక్షల పెట్టుబడితోనే గణనీయమైన లాభాలను పొందే అవకాశం ఉంది. పెట్టుబడిపై అధిక రాబడి లభించడం వల్ల మహిళల్లో వ్యాపార దృక్పథం పెంపొందడంతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు విస్తరించనున్నాయి. 84 నెలల కాలపరిమితి ముగిసిన వెంటనే బస్సును ఆర్టీసీ స్వాధీనం చేసుకుంటుంది.
హైదరాబాద్ తరలిన లబ్ధిదారులు
హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహిళా సమాఖ్యలకు బస్సులను అందజేశారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు అదనపు డీఆర్‌డీఓ నూరోద్దీన్(సెర్ప్) ఆధ్వర్యంలో మహిళా సంఘాల ప్రతినిధులు 13 బస్సులతో భారీ సంఖ్యలో హైదరాబాద్ తరలివెళ్లారు. మహిళల భద్రత దృష్ట్యా పోలీసు, వైద్య, ఇతర అధికరారుల బృందాలు వెంట వెళ్లాయి. ఈ పథకం మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనకు మాత్రమే కాకుండా గ్రామీణ మహిళల్లో నాయకత్వ లక్షణాలు, ఆర్థిక నిర్వహణ నైపుణ్యాలు పెంపొందించేందుకు దోహదపడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
మహిళా సంఘాలకు
బస్సుల నిర్వహణ బాధ్యత
జిల్లాలో 12 సమాఖ్యలకు 13 బస్సులు
హైదరాబాద్‌లో అందించిన
సీఎం రేవంత్


