జనగామ: కలెక్టర్ వైఖరి ప్రజల జీవనోపాధిఽపై ప్రభావితం చూపిస్తోందని అఖిలపక్ష నాయకులు ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వ్యవహారశైలిపై ఆందోళన వ్యక్తం చేస్తూ మంగళవారం స్థానిక విజయ ఫంక్షన్ హాల్‌లో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి బొట్ల శేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అన్ని పార్టీలు, ప్రజాసంఘాల ప్రతినిధులు, కౌన్సిలర్లు, కార్మిక, కర్షక సంఘాలు పాల్గొన్నాయి. దళిత మహిళ మంజుల మాట్లాడుతూ.. గత కలెక్టర్ మంజూరు చేసిన తన టీస్టాల్‌ను ప్రస్తుత కలెక్టర్ ఎటువంటి కనికరంలేకుండా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. సాదిక్ ఫౌండేషన్ చైర్మన్, న్యాయవాది సాదిక్ అలీ మాట్లాడుతూ.. కలెక్టర్ వైఖరి ఆందోళన కలిగిస్తోందని, కాంగ్రెస్ నాయకులు దీన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రజల్లో నమ్మకం కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 3వ వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి మాట్లాడుతూ.. మహిళా ప్రజాప్రతినిధిగా తాను కలెక్టరేట్‌కు వెళ్తే సమయం కూడా ఇవ్వలేదన్నారు. సీపీఎం, టీఆర్‌పీ, జేఎంఐ, టీఆర్‌ఎస్ (కవిత) వర్గాల నాయకులు మాట్లాడుతూ.. కలెక్టర్ తన వైఖరిని 20 రోజుల లోపు మార్చుకోకపోతే అన్ని పార్టీలు కలిసి ఉద్యమాలు చేపడతామని, రాజకీయాలకు అతీతంగా ఈ తీర్మానాన్ని అమలు చేస్తారని స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ కౌన్సిలర్ కత్తుల రాజిరెడ్డి, సుంచు విజేందర్, సింగారపు రమేశ్, మల్లిగారి రాజు, ఎండీ దస్తగిరి, న్యాయవాది రాగల్ల శ్రీహరి, ట్రాక్టర్ యజమానుల సంఘం నాయకుడు ఆకుల లక్ష్మయ్య, అజహర్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
అఖిలపక్ష సమావేశంలో
ఏకగ్రీవ తీర్మానం


