ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం వేల సంఖ్యలో తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు ప్రైవేట్ వాహనాల్లో తరలివచ్చారు. జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద షెవర్ కింద స్నానాలు ఆచరించారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఎత్తు బంగారం, ఒడిబియ్యం, పూలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజులకు పూజలు చేశారు. మొక్కుల అనంతరం మేడారం పరిసరాల్లో చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. దేవాదాయశాఖ జూనియర్ అసిస్టెంట్లు జగదీశ్వర్, మధు, రామదేవి భక్తులకు సేవలందించారు.
రేపటినుంచి కేడీసీలో ఉచిత కోచింగ్
విద్యారణ్యపురి : వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీపీజీఈటీ పరీక్షకు ఉచిత శిక్షణను హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇవ్వనున్నట్లు ప్రిన్సిపాల్ గుర్రం శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. ఈ ఉచిత కోచింగ్‌ను ఈనెల 12 నుంచి ప్రారంభించినున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి ఏటా కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో 40 రోజుల ఉచిత శిక్షణను నిర్వహిస్తున్నట్లు కెమిస్ట్రీ విభాగం అధిపతి ప్రొఫెసర్ వాసం శ్రీనివాస్ తెలిపారు. ఈ సారి కెమిస్ట్రీ సబ్జెక్టుతోపాటు ఇంగ్లిష్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్, బాటనీ, కామర్స్, మైక్రోబయాలజీ సబ్జెక్టులో కూడా పీజీ కోర్సుల్లో ప్రవేశాలకోసం విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ వివరించారు. ఆసక్తి గల విద్యార్థులు కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తమ తమ సబ్జెక్టు విభాగాల అధిపతులను ఇతర వివరాలకు పీజీ కోఆర్డినేటర్‌ను సంప్రదించాలని ప్రిన్సిపాల్ శ్రీనివాస్ కోరారు.
అంతర్జాతీయ సదస్సుకు అధ్యాపకుడు ఆదిరెడ్డి
కేయూ క్యాంపస్ : అమెరికాలోని ఎరోడెక్స్ రీసెర్చ్ యూనివర్సిటీలో ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సుకు ఆర్ట్స్‌అండ్ సైన్స్‌కళాశాల అధ్యాపకుడు, జర్నలిజం విభాగాధిపతి రుక్కిరెడ్డి ఆదిరెడ్డి పాల్గొనబోతున్నారని ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి ఆదివారం తెలిపారు. ఈ సదస్సులో మీడియా అధ్యయనాలు, డిజిటల్ కమ్యూనికేషన్ సమకాలిన జర్నలిజం ధోరణలపై ఆదిరెడ్డి తన పరిశోధన పత్రాన్ని సమర్పించబోతున్నారని ఆమె వెల్లడించారు. ఈమేరకు అంతర్జాతీయ సదస్సుకు రావాలని ఆదిరెడ్డికి ఆహ్వానం అందిందన్నారు. ప్రిన్సిపాల్‌తోపాటు పలువురు అధ్యాపకులు ఆదిరెడ్డిని అభినందించారు.
చైల్డ్‌లైన్ సంరక్షణలో ఐదేళ్ల బాలుడు
కాళోజీ సెంటర్: హనుమకొండ శిశు గృహానికి ఐదేళ్ల బాలుడిని తరలించినట్లు బాలరక్షక్ చైల్డ్ హెల్ప్‌లైన్ (1098) విభాగం సూపర్ వైజర్ కల్పన తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ) నుంచి ఓ మహిళను ఈనెల 9న 108లో ఎంజీఎంకు తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు రిజర్వ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స అందించారు. అయినా సదరు మహిళ ఆదివారం ఉదయం మృతి చెందింది. మృతురాలి వెంట ఐదు సంవత్సరాల బాలుడు ఉన్నాడు. 1098 ద్వారా చైల్డ్‌వెల్ఫేర్ అధికారులకు సమాచారం అందించడంతో వారు హనుమకొండలోని శిశు సంరక్షణ కేంద్రంలో అప్పగించారు.
హేమాచలక్షేత్రంలో కోలాహలం
మంగపేట: మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఈనెల 6వ తేదీతో ముగిసినప్పటికీ భక్తులు భారీగా తరలివస్తున్నారు. స్వయంభు స్వామి వారిని దర్శించుకునేందుకు తరలి వచ్చిన భక్తులతో ఆలయం కోలాహలంగా మారింది. ఆది వారం సెలవు రోజు కావడం, బ్రహ్మోత్సవాల కు రాలేకపోయిన భక్తులతో పాటు ఆలయ ప్రాంగణంలో జరిగిన వివాహాలకు తరలివచ్చిన వారితో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల్లో దీక్ష విరమణకు వెళ్తున్న ఆంజనేయస్వామి మాలధారులు స్వామివారిని భారీ సంఖ్యలో దర్శించుకున్నారు.


