పాలకుర్తి టౌన్: మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ చిక్కుడు రాములు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్ల, దేవరుప్పుల, పాలకుర్తి మండలాల మత్స్య సొసైటీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మత్య్స ఉత్పత్తి పెంపు, చెరువుల సమర్థ నిర్వహణ, చేపల వ్యాధుల నివారణ, కలుపు నియంత్రణ చర్యలు, ఆధునిక చేపల పెంపకం, మత్స్యకార సంక్షేమ పథకాలు, చేపపిల్లల వితరణ, నీటి వనరుల సమర్థ వినియోగంపై మత్స్యశాఖ అధికారి జరపుల కిషన్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఇరిగేషన్, డీఈఈ, ఏఈ,మత్స్య సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


