● ఆర్డీఓ కాళ్లు మొక్కుతూ వేడుకున్న రైతు
జనగామ: అకాల వర్షంతో పలుచోట్ల ధాన్యం తడవడంపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వేగవంత చర్యలు తీసుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు ఆర్డీఓ గోపిరాం జనగామ మార్కెట్‌లోని కాటన్ యార్డుకు చేరుకుని రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఒక్కో రైతు వద్దకు వెళ్లి ధాన్యం నష్టాన్ని అడిగి తెలుసుకున్న ఆర్డీఓ.. సెంటర్ నిర్వాహకులను పిలిపించి కొనుగోలు ప్రక్రియ ఎందుకు ఆలస్యమవుతుందో ఆరా తీశారు. మార్కెట్‌లో లారీలు రాక 20 రోజులుగా నిలిచిపోవడం వల్లే ధాన్యం పేరుకపోయిందని రైతులు ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే లారీలను పంపించి కొనుగోళ్లు ఆలస్యం జరగకుండా చూడాలని విన్నవించారు. ఈక్రమంలో రైతు ప్రకాశ్ తన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆర్డీఓ కాళ్లు మొక్కుతూ వేడుకున్నారు. కాటన్ యార్డులో స్థలం లేక ముగ్గురు, నలుగురు రైతులు బయట ధాన్యాన్ని ఆరబెట్టుకోగా, వాటిని కొనుగోలు చేయలేమని అధికారులు చెప్పడంతో సదరు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఆర్డీఓ కారుకు అడ్డంగా కూర్చొని రైతులు నిరస న తెలిపారు. సీరియల్ ప్రకారం ఆరుబయట ఉన్న రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని ఆర్డీఓ నిర్వాహకులకు చెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది.


