బచ్చన్నపేట: ధాన్యం తరలించడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని శనివారం మండలంలోని ఆలింపూర్, తమ్మడపల్లి గ్రామాల్లో రైతులు రాస్తారోకో నిర్వహించారు. వడ్ల బస్తాలను జనగామ–చేర్యాల జాతీయ రహదారిపై వేసి కలెక్టర్ రావాలంటూ నిరసన తెలిపారు. దీంతో వాహనాలు అక్కడే కిలోమీటరు మేర నిలిచిపోయాయి. ఈ సందర్భంగా ఆయా గ్రామాల మాజీ సర్పంచ్‌లు నరెడ్ల బాల్‌రెడ్డి, మేకల కవితరాజు మాట్లాడుతూ.. వరి కోసి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి నెల రోజులు గడుస్తున్నా ధాన్యం తరలించడం లేదని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్దకు లారీలు రావడం లేదని వెంటనే సంబంధిత అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. ధర్నా వద్దకు ఎస్సై ఎ.శ్రీకాంత్ చేరుకొని కొనుగోలు కేంద్రాలకు లారీలు వచ్చేలా అధికారులతో మాట్లాడుతానని హామీ ఇవ్వడంతో రైతులు వెనుదిరిగారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు వందలాది మంది పాల్గొన్నారు.


