‘కల్లుగీత రణభేరి’ని విజయవంతం చేయాలి
జనగామ రూరల్: ఈనెల 28న సూర్యాపేటలో జరిగే కల్లుగీత కార్మికుల రణభేరిని విజయవంతం చేయాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు ఎంవీ రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని గాయత్రి ఫంక్షన్ హాల్‌లో జిల్లా అధ్యక్షుడు కుర్ర ఉప్పలయ్య అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు కుల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని, కల్లు గీత వృత్తి గురించి ప్రభుత్వానికి పట్టింపు లేదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. గీత కార్మికులకు పెన్షన్ రూ.4 వేలు, ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలకు పెంచాలని, ప్రమాద నివారణకు వృత్తి చేసే వారందరికీ కాటమయ్య రక్షణ కవచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నీరా తాటి,ఈత ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటుకు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా కార్యదర్శి బాల్నే వెంకట మల్లయ్య మాట్లాడుతూ జిల్లా మహాసభలు ఈనెల 10వ తేదీన జనగామలో నిర్వహిస్తున్నామని, గీత సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు జొన్న గొని శ్రీనివాస్, వడ్లకొండ వెంకటేష్, మార్కా ఉపేందర్ బండపల్లి శంకరయ్య బసవగోని మహేందర్, బాల్నే ఉమాపతి, నామాల యాదగిరి, బసవగాని సమ్మయ్య, వెంకటయ్య, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.


