
ఉపాధి పనులు సక్రమంగా నిర్వహించాలి
జనగామ రూరల్: గ్రామాల్లో ఉపాధి పనులను ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సక్రమంగా నిర్వహించాలని డీఆర్డీఓ వసంత అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనులపై గ్రామాల్లో సర్వే నిర్వహించి సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామాల్లో ఉపాధి పనుల వివరాలు, గ్రామాల వారీగా ఆడిట్ చేసిన అంశాలపై చర్చించారు. మండలంలో 21 గ్రామ పంచాయతీలు ఉండగా.. వాటిలో పనుల వివరాలు, ఎన్ని రకాల పనులు చేశారు? కూలీ, వేతనాలు, ఈజీఎస్ ద్వారా నిర్వహిస్తున్న విషయాలపై సర్వే చేపట్టారు. సోషల్ ఆడిట్ తూతూమంత్రంగా నిర్వహించి పనుల వివరాలు వెల్లడించారు. కూలీలకు గ్రామాల్లో సమాచారం లేకపోవడంతో కేవలం అధికారులు కార్యదర్శులు, ఉపాధి సిబ్బంది, అధికారులు పాల్గొని నిర్వహించారు. గతంలో అన్ని గ్రామాల నుంచి కూలీలు వచ్చి వారి సమస్యలు, పనుల్లో అవకతవకలు వెల్లడించేవారు. ప్రస్తుతం అధికారులు మాత్రమే నిర్వహించడంతో ఎలాంటి విషయాలు తెలియడం లేదని పలు గ్రామాల కూలీలు చెబుతున్నారు. కాగా.. గతేడాది ఏప్రిల్1 నుంచి మార్చి 31 వరకు చేపట్టిన పనుల్లో రికవరీ రూ.73,515 వచ్చినట్లు అధికారులు తెలిపారు. సీఓలు రూ.2,932, టీఏలు రూ.7,811, ఎఫ్‌ఏలు రూ.25,946, కార్యదర్శులు రూ.36,826 రికవరీ అయ్యాయి. ఇందులో ఇన్‌చార్జ్ ఎంపీడీఓ సంత్‌కుమార్, డీవీసీ సంధ్య, క్యూసీ సభ్యులు రాజవర్ధన్, అంబుడ్స్‌మన్ రాజు, ఎస్‌ఆర్పీ నరేందర్, ఏపీఓ భిక్షపతి, ఈసీ మాధవరెడ్డి టీఏలు అనిల్ జాంగీర్, యాకూబ్ తదితరులున్నారు.
డీఆర్డీఓ వసంత
కూలీలు లేకుండానే
సామాజిక తనిఖీ ప్రజావేదిక