
రైతులకు నష్టపరిహారం అందించాలి
జనగామ రూరల్: ఎండిన పంటలకు, విత్తనాలకు నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందునాయక్ డిమాండ్ చేశారు. రైతు సంఘం ఆధ్వర్యంలో మండలంలోని శామీర్‌పేటలోని ఊరకుంట చెరువు, కర్రె సత్తయ్యకు చెందిన ఎండిన పొలం, వరి నారును పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా కరువు నెలకొందని, దేవాదుల ద్వారా చెరువులు నింపి రైతులను ఆదుకోవాలన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇప్పటి వరకు రెండు, మూడు సార్లు విత్తనాలు నాటారన్నారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా లిఫ్టింగ్ చేసి జనగామ ప్రాంతంలోని 9 రిజర్వాయర్లు, 723 చెరువులు, కుంటలను నింపడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. నేటికీ గోదావరి జలాలను పూర్తిస్థాయిలో లిఫ్టింగ్ ప్రారంభించలేదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అజ్మీరా సురేష్ నాయక్ , తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మంగ బీరయ్య, ఉర్సుల కుమార్, రైతులు ఆవుల శ్రవణ్, నేతాజీ, తాండ్ర ఆనందం, చింతకింది రాజు, కర్రె సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.