
నాడు ఆదర్శం.. నేడు విచ్ఛిన్నం
కనుమరుగవుతున్న ఉమ్మడి కుటుంబాలు
నేడు ప్రపంచ జనాభా దినోత్సవం
పాశ్చాత్య పోకడలతో దూరమవుతున్న ప్రేమ, అనుబంధాలు
కుటుంబ పోషణ, చదువు, ఇతర ఖర్చుల భారం
పొద్దన లేచింది మొదలుకుని రాత్రి పడుకునే వరకు ఇళ్లంతా సందడి.. కడుపులో ముద్ద వేసామంటే ఎవరిపనికి వారు వెళ్లడం.. సాయంత్రానికి ఇంటికి చేరడం... అందరి సంపాదన ఇంటిపెద్ద చేతిలో పెట్టే ఆనాటి ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయ్యాయి. సంపాదన తక్కువ ఉన్నా క్రమశిక్షణతో పిల్లలను పోషించడంలో ఉమ్మడి కుటుంబాలు సక్సెస్ అయి ఆదర్శంగా నిలిచాయి. కానీ, రెండున్నర దశాబ్దాలుగా ఉమ్మడి కుటుంబాల్లో వేరుకుంపటి మొదలైంది. పిల్లల కార్పొరేట్ చదువులు.. భార్య, భర్త ఉద్యోగం వంటి కారణాలతో వేరుకుంపటి అనివార్యంగా మారింది. దీంతో బంధాలు, అనుబంధాలు అంటే పిల్లలకు తెలియని పరిస్థితి ఏర్పడింది. కానీ, జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆనాటి ఉమ్మడి కుటుంబాలు నేటికీ సంతోషంగా ఉంటున్నాయి. కానీ, ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు, పిల్లలను పెంచే ఓపిక, ఆలనా పాలనా చూసుకునే పెద్ద దిక్కులు లేకపోవడంతో ఒక్కరు, లేదా ఇద్దరితోనే సరిపుచ్చుకుంటున్నారు. ఈనేపథ్యంలో నేడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం.
స్టేషన్‌ఘన్‌పూర్: ఈ ఫొటోలో కనిపిస్తున్నది స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని రంగరాయగూడెం గ్రామానికి చెందిన ఐత వీరేశం కుటుంబం. గ్రామానికి చెందిన ఐత రామయ్య, ద్రాక్షమ్మ దంపతులకు ఐదుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. రామయ్య చిన్న కిరాణాషాపు నిర్వహిస్తూ పది మంది సంతానాన్ని పోషించారు. ఉమ్మడి కుటుంబంగా ఉంటూ అందరి వివాహాలు జరిపించారు. పదేళ్ల క్రితం రామయ్య మృతి చెందగా, ద్రాక్షమ్మ ఏడాది క్రితం మృతి చెందారు. అయినప్పటికీ ఐదుగురు అన్నదమ్ములు ఉమ్మడి కుటుంబంగా గ్రామంలోనే కలిసి ఉంటున్నారు. వారి వ్యాపారాలు వేరైనా అందరూ ఒకే ఇంట్లో నివాసముంటూ ఇప్పటికీ రాత్రి భోజనాలు కలిసే చేస్తారు. పెద్దన్న వీరేశం మాట మిగిలిన నలుగురు తమ్ములు ఏనాడు జవదాటకుండా ఉంటూ గ్రామంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
– జనగామ