జగిత్యాల: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. గూగుల్‌మీట్ ద్వారా తహసీల్దార్లతో మాట్లాడారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో అవసరమైన వసతులు కల్పించాలన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా మిల్లర్లు, ట్రాన్స్‌పోర్టు యజమానులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. మక్కల కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి చేయాలని సూచించారు.
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహించొద్దని సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్లకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, గోదాంలు తక్కువగా ఉంటే ప్రైవేట్‌వి తీసుకోవాలని, స్థానిక హమాలీలను వందశాతం ఉపయోగించుకోవాలని సూచించారు. లారీల కొరత ఉన్నచోట ట్రాక్టర్లను వినియోగించుకుంటున్నామని కలెక్టర్ సీఎంకు వివరించారు. అదనపు కలెక్టర్‌లత, ఆర్డీవో మధుసూదన్, డీఆర్డీవో రఘువరణ్, మనోజ్‌కుమార్, భాస్కర్, నరేశ్, ప్రకాశ్ పాల్గొన్నారు.
కొడిమ్యాలలో మిల్లుల తనిఖీ
కొడిమ్యాల: మండలంలోని చెప్యాలలోగల శ్రీలక్ష్మీగణేశ్, లక్ష్మీసరస్వతి, లక్ష్మీనరసింహ, శ్రీలక్ష్మీసాయి ఇండస్ట్రీస్, నమిలికొండలోని నరసింహ, ధరణి దత్తసాయి, చాముండి రైస్ మిల్లులను కలెక్టర్ పరిశీలించారు. మిల్లులకు వస్తున్న ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా అన్‌లోడ్ చేసుకోవాలన్నారు. హమాలీలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆర్డీవో మధుసూదన్, సివిల్ సప్లై డీఎం జితేంద్ర ప్రసాద్, తహసీల్దార్ ఉన్నారు.
వేగంగా మక్కల కొనుగోళ్లు
జగిత్యాలరూరల్: జిల్లాలో మక్కల కొనుగోలు వేగంగా సాగుతోందని కలెక్టర్ అన్నారు. జిల్లావ్యాప్తంగా 12 కేంద్రాలు ఏర్పాటుచేసి ఇప్పటివరకు 6,231 మంది రైతుల నుంచి 23,428 టన్నులు కొనుగోలు చేశామన్నారు. 15 గోదాములను సిద్ధం చేశామన్నారు. మార్క్‌ఫెడ్ డీఎం హబీబ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


