బండి సంజయ్‌.. రాజీనామా చేయ్‌.. | - | Sakshi
Sakshi News home page

బండి సంజయ్‌.. రాజీనామా చేయ్‌..

May 12 2026 12:38 AM | Updated on May 12 2026 12:38 AM

ఓటుకు నోటు కేసు కోసమే బీజేపీతో రేవంత్‌ లాలూచీ బాలిక కేసుపై పీసీసీ స్పందించకపోవడం దారుణం బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి

జగిత్యాలటౌన్‌: కేంద్రసహాయ మంత్రి బండి సంజ య్‌ కుమారుడు ఓ బాలికను లొంగదీసుకుని అరాచకం చేస్తుంటే సీఎం రేవంత్‌రెడ్డి ఏం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. రేవంత్‌ కళ్లకు గంతలు కట్టుకున్నాడా..? లేక ఓటుకు నోటు కేసు కోసం బీజేపీతో లాలూచి పడ్డాడా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో నేరాలు జరుగుతుంటే కేంద్ర, రాష్ట్ర హోంమంత్రులు బండి సంజయ్‌, రేవంత్‌రెడ్డి ఏంజరగనట్లు సైలెంట్‌గా ఉండటమే వారి బంధానికి నిదర్శనమన్నారు. తన దృష్టికి వచ్చిన విషయాన్ని సంబందిత శాఖ అధికారులకు రిఫర్‌ చేయడం కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి బాద్యత అని, అలాంటిది స్వయంగా కేంద్రమంత్రే నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం శిక్షార్హమన్నారు. నేరాలను ప్రోత్సహిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కూడా శిక్షార్హుడేనన్నారు. రాష్ట్రంలో నేరాలు జరుగుతుంటే మోదీ ఆదీనంలోని సెంట్రల్‌ ఇంటలిజెన్స్‌ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ప్రధాని మోదీ బేటీ బచావో అంటే కేంద్ర మంత్రి బండి మాత్రం బేటా బచావో అంటున్నారని ఎద్దేవా చేశారు. తన కుటుంబ సభ్యులను నియంత్రించలేని బండి దేశంలో శాంతిభద్రతలు ఎలా కాపాడుతారని ప్రశ్నించారు. బాలిక జీవితం అభాసుపాలు కావడానికి కారణమైన బండి సంజయ్‌కు ఏమాత్రం నైతిక విలువలున్నా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. బండి కుమారుడు భగీరథ్‌పై గతంలోనే యాంటీ ర్యాగింగ్‌ కేసులున్నాయని, బాలికను లొంగదీసుకోవడం కిడ్నాప్‌ కింద కు వస్తుందని, ఈ నేరారోపణలు ఎదుర్కొంటున్న భగీరథ్‌కు పోక్సోతోపాటు సాధారణ చట్టాల కింద దాదాపు 20ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉందన్నారు. బాలిక ఫిర్యాదుపై నిర్లక్ష్యం వహించిన పేట్‌బషీరాబాద్‌ పోలీస్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ను సస్పెండ్‌ చేయాలన్నారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత, హరిచరణ్‌రావు, ధర రమేశ్‌, సురేందర్‌, చందా రాధాకిషన్‌, కల్లెపెల్లి దుర్గయ్య, గుండ మధు, వెంకటేశ్వర్‌రావు తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement