మల్యాల: కొండగట్టు గిరి ప్రదక్షిణకు నిధుల విడుదలకు కృషి చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. కొండగట్టు శ్రీఆంజనేయస్వామివారిని సోమవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ గిరి ప్రదక్షిణకు సరిపడా సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. జయంతి ఉత్సవాలకు అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపట్టామని అన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు. ముత్యంపేట సర్పంచ్ దారం ఆదిరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ దినేష్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, గిరి నాగభూషణం, శైలేందర్‌రెడ్డి, నిశాంత్ రెడ్డి, రాములు పాల్గొన్నారు.
కొనుగోళ్లు వేగవంతం చేయాలి
మెట్‌పల్లి రూరల్: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులకు సూచించారు. మెట్‌పల్లి మండలం ఆత్మకూర్, ఆత్మనగర్, వెల్లుల్ల గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను సోమవారం తనిఖీ చేశారు. తూకం వేసిన బస్తాలను జాప్యం చేయకుండా మిల్లులకు తరలించాలన్నారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు రైతులను అప్రమత్తం చేయాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ నీత, అధికారులు ఉన్నారు.
బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు
జగిత్యాలక్రైం: బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. సోమవారం తన కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 14 మంది అర్జీ సమర్పించగా.. వారితో నేరుగా మాట్లాడారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.


