మెట్‌పల్లి మండలంలో జోరుగా మట్టి దందా బండలింగాపూర్‌లో గుట్టను తవ్వుతున్న అక్రమార్కులు భారీ యంత్రాలతో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న వైనం పట్టించుకోని అధికార యంత్రాంగం
మెట్‌పల్లిరూరల్: జిల్లాలోని ప్రకృతి సంపదను అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. నిబంధనలను గుట్టల్లో తొక్కి.. ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా మొరం తవ్వకాలు చేపడుతున్నారు. మెట్‌పల్లి మండలం బండలింగాపూర్ రెవెన్యూ పరిధిలోని 63వ జాతీయ రహదారికి కేవలం 400మీటర్ల దూరంలో ఉన్న కుందేలు గుట్టను ఎక్స్‌వేటర్లతో అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ దందా సాగుతున్నా.. అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడకపోవడం, అడ్డుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కొన్నినెలల క్రితం కలెక్టర్ సత్యప్రసాద్‌ను స్వయంగా కలిసి ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో తవ్వకాలకు కొద్దిరోజులు బ్రేక్ పడినప్పటికీ మళ్లీ ఎప్పటిలాగే యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తుండడం గమనార్హం.
38 ఎకరాల విస్తీర్ణం
కుందేలు గుట్ట సుమారు 38 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో గతంలో బండలింగాపూర్ గీత కార్మిక సంఘానికి ఐదెకరాలు, ఒడ్డెర కులస్తులకు 20ఎకరాల వరకు అసైన్డ్ పట్టాలిచ్చినట్లు తెలిసింది. అక్కడ సాగుకు ఏ మాత్రం కూడా అనువు కాదని, చదునైతే అనువుగా మారుతుందని కొందరు అసైన్డ్ పట్టాదారులు మొరం అక్రమ తవ్వకాలకు అభ్యంతరం తెలపడంలేదని తెలుస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు గుట్టను ఇష్టారీతిగా తవ్వేస్తున్నారు. ఎక్స్‌వేటర్‌ల సహాయంతో పెకిలించిన మొరాన్ని టిప్పర్లలో మెట్‌పల్లి పట్టణంతోపాటు చుట్టుపక్క గ్రామాలకు తరలిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో నూతన నిర్మాణాలు, వెంచర్ల అవసరాలకు విక్రయిస్తున్నారు. టిప్పర్ మొరానికి వ్యాపారులు రూ.4వేలకు పైగానే వసూలు చేస్తున్నట్లు సమాచారం. చీకటి పడిందంటే చాలు తవ్వకాలు ప్రారంభిస్తున్న అక్రమార్కులు.. వేకువజాము వరకు తవ్వుతూనే ఉన్నారు. పొద్దుపొడిచే వరకూ రహదారిపై మొరం వాహనాలు వెళ్తూనే ఉంటున్నాయి.
చీకటి పడితే చాలు..
గతంలో పగలు, రాత్రి తేడా లేకుండా సాగిన ఈ తవ్వకాలు ప్రస్తుతం రాత్రి సమయాల్లోనే జరుగుతున్నాయి. ఇందుకు మొరం తవ్వకాల విషయంలో కొందరి మధ్య వివాదాలు ఏర్పడడం, అధికారులు వరుసగా ఫిర్యాదులు వెళ్లడమే కారణమన్న ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే సంజయ్ గుట్టను తవ్వేస్తున్న విషయంపై ఫిర్యాదు చేసిన సమయంలో మైనింగ్ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. మొరం తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ఆ సమయంలో దందాకు బ్రేక్ పడుతుందేమోనని అందరూ భావించారు. తర్వాత మైనింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడనేలేదు. దీంతో మొరం తవ్వకాలు,తరలింపు యథేచ్చగా సాగిపోతోంది.


