జగిత్యాలరూరల్: రియల్ వ్యాపారులు వాగులు, వంకలను వదలడం లేదు. భూముల ధరలకు రెక్కలొస్తుండడంతో ముంపు, వాగు పరివాహక ప్రాంతాల్లో ఉన్న సాగుచేయని భూములను గుర్తించి భూ యజమానులకు ఎంతో కొంత ఇస్తూ వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకుని రాత్రికి రాత్రే ముంపు ప్రాంతాల్లో మట్టిపోసి చదును చేసి ఇళ్లు, ఇతర నిర్మాణాలకు విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. రియల్ వ్యాపారులకు అధికార పార్టీకి చెందిన నాయకుల అండదండలు ఉండడంతో దందా విచ్చలవిడిగా కొనసాగుతోంది. జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులో మోతె నుంచి ప్రవహించే వాగు కింది ప్రాంతం తిమ్మాపూర్ శివారులో వారం రోజులుగా రాత్రివేళ టిప్పర్ల ద్వారా మట్టి తెప్పించి ముంపు ప్రాంతం, వాగు ప్రవహించే ప్రాంతాన్ని పూడ్చివేశారు. రానున్న రోజుల్లో నీటి ప్రవాహం వెళ్లకుండా మట్టితో చదును చేశారు. వానాకాలంలో వర్షాలు తీవ్రమైతే నీటి నిల్వలు పెరిగి జగిత్యాల, గొల్లపల్లి ప్రధాన రహదారిలో తాతమ్మ గుడి వద్ద ఉన్న వంతెన మునిగిపోయి రాకపోకలు స్తంభించిపోనున్నాయి. జగిత్యాల పట్టణానికి కూతవేటు దూరంలో వారం రోజులుగా ముంపు ప్రాంతాన్ని పూడ్చివేసి చదును చేస్తున్నా అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో కోట్లాది రూపాయల విలువ గల భూములను చదును చేసి అమాయకులకు విక్రయించి రియల్ వ్యాపారులు పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు.
కనుమరుగైన వాగు
ఎగువ ప్రాంతం నుంచి వరద వచ్చే వాగును మట్టి పోసి చదును చేశారు. దీంతో రానున్న రోజుల్లో ఎగువ నుంచి వచ్చే వరద నీరు ఎటు వెళ్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే తాతమ్మగుడి ప్రాంతం నుంచి శ్మశానవాటిక వరకు నీరు ప్రవహించే ప్రాంతాలను చదును చేస్తూ నిర్మాణాలు కొనసాగిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే వాగులు, ముంపు ప్రాంతాలు కనుమరుగు కానున్నాయి.
ఆందోళన చెందుతున్న రైతులు
రానున్న రోజుల్లో దిగువ ప్రాంతంలోని ముప్పాల చెరువు, పొలాస చెరువులు నిండడం కష్టమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పంటలు సాగుచేయడం కష్టతరంగా మారనుంది. కొద్ది రోజులుగా తిమ్మాపూర్, రఘురాములకోట, మోతె గ్రామాలకు చెందిన రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ముంపు ప్రాంతాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు.


