రాయికల్: మక్కల కొనకుంటే రైతుల పక్షాన పోరాడుతామని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. పట్టణంలోని మార్కెట్‌యార్డులో మక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కొందరు రైతులు నిర్వాహకులకు డబ్బులిస్తేనే కాంటా చేస్తున్నారని వసంత దృష్టికి తీసుకురాగా.. వెంటనే ఆమె కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని హెచ్చరించారు. ఆమె వెంట మాజీ జెడ్పీటీసీ గోపి మాధవి, మున్సిపల్ వైస్ చైర్మన్ తురగ సౌజన్య, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్ పాల్గొన్నారు.
అవకతవకలకు పాల్పడితే చర్యలు
మల్లాపూర్: మక్కలు, ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి మిల్లులకు తరలించాలని మెట్‌పల్లి ఆర్డీవో జి.నరసింహరావు అన్నారు. అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. మండలకేంద్రంలోని మార్కెట్‌యార్డ్‌లో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రాల్లో నీటి సదుపాయం కల్పించాలన్నారు. తహసీల్దార్ రాంచందర్, ఆర్‌ఐ రాజేశ్, అశోక్, ప్యాక్స్ సీఈవో రమేశ్ పాల్గొన్నారు.
రైతులెవరూ అధైర్యపడొద్దు
తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులెవరూ అధైర్యపడొద్దని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. స్థానిక మార్కెట్‌యార్డులో కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ అంతడపుల పుష్పలతతో కలిసి పరిశీలించారు. ఎమ్మెల్యే సంజయ్ రైతులను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. 10 రోజుల్లో మక్కల కొనుగోళ్లు పూర్తవుతాయన్నారు. మాజీ ఎంపీపీ నల్ల రాజన్న, ఉపసర్పంచ్ గడ్డం సోమరెడ్డి, కాంగ్రెస్ సేవాదళ్ మండల అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.


