మెట్‌పల్లి: ఫోర్త్‌సిటీ అంశాన్ని పక్కనపెట్టి ముందుగా రైతుల గురించి ఆలోచించాలని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం, మొక్కజొన్న కేంద్రాలను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావుతో కలిసి శనివారం పరిశీలించారు. అక్కడి సమస్యలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. అడిషనల్ కలెక్టర్ లతతో ఫోన్‌లో మాట్లాడారు. సమస్యలను ఆమెకు వివరించి పరిష్కరించాలని సూచించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రైతులు పండించే పంటలకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, రేవంత్‌రెడ్డికి ఫోర్త్ సిటీ మీద ఉన్న శ్రద్ద రైతులపై లేదని పేర్కొన్నారు. ఆయన పాలన ఇలాగే కొనసాగితే మరో రెండున్నర ఏళ్లలో వ్యవసాయం కనుమరుగవుతుందన్నారు. పంటల కొనుగోలులో జాప్యంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నా.. ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి నదీ జలాలను ఎల్లంపల్లికి మళ్లిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన రేవంత్.. ఇంతవరకు నిలబెట్టుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ గడువు ముగిసేలోపు హామీని నిలబెట్టుకోకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు రేవంత్‌కు ఉండదన్నారు.


