జగిత్యాలజోన్: జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతిని కలెక్టర్ సత్యప్రసాద్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, సంక్షేమం గురించి చర్చించారు.
‘ఇందిరమ్మ’తో
సొంతింటి కల సాకారం
జగిత్యాలరూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో నిరుపేద సొంతింటి కల సాకారమైందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి గ్రామంలో వడ్లూరి సుజాత నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. రెండెకరాలు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు అందజేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధితో పాటు, సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుందని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, ఎంపీడీవో రమాదేవి, సర్పంచ్ కట్ట రాజేందర్, మాజీ ఎంపీటీసీ కర్నె భూమరెడ్డి, మాజీ సర్పంచ్ గంగారాం, సదానందం, లింగారెడ్డి, తిరుపతి, వెంకటేశ్, ప్రశాంత మల్లారెడ్డి, అనిల్ పాల్గొన్నారు.
ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
జగిత్యాలఅగ్రికల్చర్: ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి అన్నారు. అకాల వర్షంతో తడిసిన వరి, మొక్కజొన్న ధాన్యాన్ని శుక్రవారం పరిశీలించారు. ధాన్యం తూకం వేసిన తర్వాత లారీలు రావడం లేదని, వర్షానికి సంచులు తడిస్తే రైతులదే బాధ్యత అంటున్నారని రైతులు జీవన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో జీవన్ రెడ్డి మా ర్క్‌ఫెడ్ ఎండీ, కలెక్టర్‌తో మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేయాలని సూచించారు. మార్కెట్‌లో 3 గో దాంలు ఖాళీగా ఉన్నాయని, అందులో నిల్వ చేయాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలుగనీయవద్దని అధికారులకు సూచించారు.
పశుసంపదను పెంచేందుకు రైతు సదస్సులు
జగిత్యాలఅగ్రికల్చర్/జగిత్యాలరూరల్: జిల్లాలో పశుసంపదతో పాటు పాల ఉత్పత్తిని పెంచేందుకు గ్రామీణ ప్రాంతాల్లో రైతు సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్ ప్రకాశ్ తెలిపారు. జగిత్యాల రూరల్ మండలంలోని మోరపల్లి గ్రామంలో శుక్రవారం ఉచిత పశువైద్య శిబిరంతో పాటు రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాడి పశువుల్లో వ్యాధులను నియంత్రించేందుకు సంరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. పాడి ఉత్పత్తిని పెంచేందుకు ఆచరించాల్సిన పద్ధతులపై అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు. ఉచిత పశువైద్య శిబిరాల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. వెటర్నరీ ఏడీ నరేశ్, శ్రీదేవి, డాక్టర్ నరేశ్, సర్పంచ్ రాజేందర్, నాయకులు ఆకునూరి గంగారాజం, లింగారెడ్డి, గంగారాం, భూమారెడ్డి, పారావెటర్నరీ సిబ్బంది రవీందర్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.


