జగిత్యాల: చేపల చెరువులో కలుపు మొక్కలను నివారించాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పారిశ్రామిక, మత్స్యకార, మార్కెటింగ్ లైసెన్స్ సహకార సంఘాల అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని మత్స్యశాఖ చెరువుల్లో కలుపు మొక్కల నివారణ చేపట్టాలని, వ్యాధుల నివారణ, అధికోత్పత్తికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా మత్స్యశాఖ అధికారి సురేశ్‌బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
త్వరలో భూముల రిజిస్ట్రేషన్ విలువల సవరణ
త్వరలో భూముల రిజిస్ట్రేషన్ విలువల సవరణ చేయడం జరుగుతుందని అదనపు కలెక్టర్ లత అన్నారు. శుక్రవారం ఆర్డీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, సబ్ రిజిస్ట్రార్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మార్కెట్ విలువల సవరణకు సంబంధించి ఫార్మర్–1 నుంచి 4 వరకు వివరాలను సమగ్రంగా సిద్ధం చేసి ఈనెల 12లోపు సమర్పించాలన్నారు. నిబంధనలు, ప్రస్తుత రికార్డు, మార్కెట్‌లోని విలువలను పరిగణలోకి తీసుకుని ఖచ్చితమైన విలువలు నమోదు చేయాలని సూచించారు. గ్రామాలు, పట్టణాలు, రహదారులు, సర్వే నంబర్లు, వర్గీకరణల వారీగా వివరాలను పరిశీలించి పొరపాట్లు లేకుండా నివేదికలు పంపించాలని ఆదేశించారు. సమయ పాలన పాటిస్తూ నిర్ణీత గడువులోపు అన్ని ఫార్మెట్లు సమర్పించాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రతి కూలీ లేబర్ కార్డు తీసుకోవాలి
పెగడపల్లి(ధర్మపురి): భవన నిర్మాణ, ఇతర రంగాల కార్మికులకు లేబర్ కార్డు ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయని, ప్రతీ ఒక్కరు లేబర్ కార్డు తీసుకోవాలని జిల్లా లేబర్ అధికారి అనిల్ కదం కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో ఉపాధిహామీ పని ప్రదేశంలో కూలీలకు అవగాహన కల్పించారు. లేబర్ కార్డు పొందడం ద్వారా కుటుంబ పెద్ద సహజంగా మరణిస్తే రూ.2 లక్షలు, ప్రమాదంలో మరణిస్తే రూ.10 లక్షలు జీవిత బీమా ద్వారా ఆర్థికసాయం అందే అవకాశముందన్నారు. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న వారికి లేబర్ కార్యాలయం నుంచి కార్డు ఇవ్వడం జరుగుతుందని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సర్పంచ్ అరుణ, ఏఎంసీ చైర్మన్ రాములుగౌడ్, జిల్లా ఉపాధి కల్పనాధికారి సదానందం, కార్యదర్శి ప్రవీన్, ఏఎంసీ డైరెక్టర్ విజయభాస్కర్, స్వామి, రవి పాల్గొన్నారు.


