నిలిచిన మధ్యాహ్న భోజనం
ఇబ్రహీంపట్నం: మండలంలోని వర్షకొండ జెడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం మధ్యాహ్న భోజనం నిలిచిపోయింది. హెచ్‌ఎం రాజేందర్ ఒత్తిడి తేవడంతోనే తాను రాజీనామా చేయాల్సి వచ్చిందని నిర్వాహకులు నారే చిన్ను తెలిపారు. ఆమె కథనం ప్రకారం.. పాఠశాలలో 19 ఏళ్లుగా మధ్యాహ్న భోజన వర్కర్‌గా చిన్ను పనిచేస్తోంది. కొద్దిరోజుల క్రితం హెచ్‌ఎంగా ఇక్కడకి వచ్చిన రాజేందర్ చిన్నును వంట విషయంలో తప్పుపడుతూ వస్తున్నాడు. మధ్యాహ్న భోజనం వండొద్దంటూ ఒత్తిడి తెస్తున్నాడు. అనారోగ్యంతో ఉండడంతో భోజనం వండటం వీలు కాదని, రాజీనామా చేస్తున్నానంటూ ఆయనే లేఖ రాసి ఉన్నతాధికారులకు పంపించాడు. దీంతో ఆమె శనివారం వంట చేసేందుకు రాలేదు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ వరప్రసాద్ ఏపీఎం శంకర్‌తో కలిసి పాఠశాలకు వచ్చి చిన్నును విచారించారు. తాను వండిపెట్టడం హెచ్‌ఎంకు ఇష్టం లేక తరచూ వేధిస్తున్నాడని వివరించింది. విద్యార్థులను విచారించగా వంట రుచికరంగానే చేస్తోందని తెలిపారు. అనంతరం అక్కడే ఉన్న వర్కర్ మేఘనతో భోజనం వండిపెట్టారు. ఎంఈవో సెలవులో ఉన్నందున సోమవారం పాఠశాలకు వచ్చి విచారణ చేపడతామని తహసీల్దార్ తెలిపారు.


