పిల్లర్లు దాటని తహసీల్దార్ భవనం
కోరుట్ల: ఒకటికాదు.. రెండు కాదు.. ఏకంగా పాతికేళ్లుగా తహసీల్దార్ కార్యాలయం అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కోరుట్లలోని వివిధ ప్రాంతాలకు కనీసం నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఆదర్శనగర్‌లో ఉన్న తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లలేక సతమతం అవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఒక్కసారి వెళ్తే పని అవుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లడానికి ప్రతీసారి రూ.200 ఖర్చు వస్తోందని జనం వాపోతున్నారు. ప్రజల అవస్థలను తొలగించడానికి రెండేళ్ల క్రితం నేతలు ముందుకొచ్చినా నిబంధనలు విస్మరించి నిర్ణయాలు తీసుకోవడం సమస్యాత్మకంగా మారింది.
పట్టణం నడిబొడ్డున..
తహసీల్దార్ కార్యాలయం దూరంగా ఉండటంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించి గత ప్రభుత్వ హయాంలో పట్టణం నడి బొడ్డున ఎస్సారెస్పీ స్థలంలో తహసీల్దార్ కార్యాలయం నిర్మాణానికి అప్పటి నేతలు సంకల్పించారు. కల్లూర్ రోడ్ ఎస్సారెస్పీ స్థలంలో సుమారు 450 గజాల మేర స్థలం కేటాయించి భవనం నిర్మాణానికి రూ.54లక్షలతో టెండర్లు పిలిచారు. ఆ వెంటనే టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ భవన నిర్మాణం పనులు ప్రారంభించారు. ఆర్నెళ్ల వ్యవధిలో పనులు నత్తనడకన సాగాయి. కేవలం పిల్లర్ల వరకు మాత్రమే పనులు పూర్తయ్యాయి. అనంతరం ఎస్సారెస్పీ నుంచి నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ లేదన్న సాకుతో తహసీల్దార్ కార్యాలయం పనులకు ఆటంకాలు వచ్చాయి. ఫలితంగా కాంట్రాక్టర్ పనులు నిలిపేశారు. సుమారు ఏడాదిన్న కాలం గడుస్తున్నా తహసీల్దార్ కార్యాలయం పనులు పిల్లర్ల వరకే మాత్రమే పూర్తి కావడంతో జనం ఇప్పటికీ దూరంగా ఉన్న తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లడానికి ఎప్పటిలాగే తిప్పలు పడుతున్నారు.
ఈ ఒక్కదానికే ఎన్‌వోసీ
ఎస్సారెస్పీ స్థలంలో ఇదివరకు మున్సిపల్ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంపు క్వార్టర్, సబ్ రిజిస్టార్ కార్యాలయం, పింఛనర్ల సంఘం షెడ్లు, ఇతరత్రా ప్రైవేటు వ్యాపారులకు చెందిన షెడ్లు, మున్సిపల్ కూరగాయల మార్కెట్, పెట్టి వెండర్స్ షెడ్లు, కేడీసీసీ భవనం, పీఏసీఎస్ భవనం.. ఇలా చెప్పుకుంటే పోతే లెక్కలేని నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటిలో చాలామటుకు ఎన్‌వోసీ లేకుండా జరిపిన నిర్మాణాలే కావడం గమనార్హం. సాధారణంగా ఎస్సారెస్పీ స్థలాన్ని ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు బదలాయించాలంటే కెబినెట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇలా ఆమోద ముద్ర పొంది ఎన్‌వోసీ తీసుకున్న నిర్మాణాలు ఇక్కడ ఏవీ లేకపోగా కేవలం తహసీల్దార్ కార్యాలయానికి మాత్రం ఇవ్వడం విడ్డూరంగా తోస్తోంది. ఈ ఎన్‌వోసీ పేరిట తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణం ఆపేయడం ఎంత వరకు సమంజసమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు వ్యాపారులకు అవసరం లేని ఎస్‌వోసీ కేవలం తహసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి మాత్రమే వర్తిస్తుందా..? అన్న విషయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్‌వోసీ చిక్కుముడి తొలగించి తహసీల్దార్ కార్యాలయం నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.


