
పరిశోధనలు కేరాఫ్ పొలాస
జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాలరూరల్ మండలంలోని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వ్యవసాయ పరిశోధనలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇక్కడి శాస్త్రవేత్తలు వరిలో కొత్తకొత్త రకాలను రూపొందిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 500 రకాలపై పరిశోధనలు చేస్తున్నారు. కొత్త విత్తనాల ఆవిష్కరణలో భాగంగా వాటి రకం..? దిగుబడి ఎలా ఉంటుంది..? తెగుళ్లను ఎలా తట్టుకుంటుంది..? అనే విషయాలను పరిశీలిస్తుంటారు.
దేశంలోని 500 వరి రకాలపై
దేశంలోని వ్యవసాయ యూనివర్సిటీల నుంచి సేకరించిన దాదాపు 500 వరి రకాలపై పొలాసలో పరిశోధనలు చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల నుంచి సేకరించిన విత్తనాలను నారుగా పోసి.. ఒక్కో పంటకాలాన్ని పరీక్షిస్తుంటారు. ఆయా రకాలను ఒక్కో చదరపు మడిలో నాటు వేస్తారు. ఏ రకం విత్తనం దిగుబడి ఎక్కువగా ఇస్తుంది..? ఏ రకం విత్తనం చలి, తెగుళ్లను తట్టుకోవడం లేదు..? తదితర విషయాలను శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు. అలాగే ఏ రకం విత్తనాన్ని మరే రకం విత్తనంతో సంకరీకరణం చేసి అధిక దిగుబడినిచ్చే కొత్త రకం విత్తనాన్ని తయారు చేయవచ్చనే అంశంపై ప్రతిరోజు శాస్త్రవేత్తలు పరిశీలిస్తుంటారు. ఏ రకంలో తాలు గింజలు ఎక్కువగా వచ్చాయి..? గింజల బరువు ఎలా ఉంటుంది..? అనే విషయాలపై ప్రత్యేకంగా నివేదిక తయారు చేసి, ఆయా శాస్త్రవేత్తలతో చర్చిస్తుంటారు.
చాలా జాగ్రత్తగా పరిశీలన
ఉదాహరణకు: పశ్చిమబెంగాల్‌లో అధిక దిగుబడి వచ్చిన విత్తనంలో.. ఇక్కడ ఎలాంటి దిగుబడులు వచ్చాయి..? ఇక్కడి వాతావరణాన్ని ఏ మేరకు తట్టుకుంటుంది..? అనే విషయాలను తెలుసుకుంటారు. ప్రధానంగా ఇక్కడి వాతావరణాన్ని తట్టుకున్న రకాలపై మళ్లీ రకరకాల పరిశోధనలు చేస్తుంటారు. ఒక రకం విత్తనం మరో రకం విత్తనంతో కలవకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. చివరి పుప్పొడి నుంచి గింజ దశకు మారే సమయంలో కవర్లు చుడుతుంటారు. గాలికి ఒక రకం పుప్పొడి మరో రకంపై పడకూడదని అలా చేస్తుంటారు.
నారు పోసే సమయంలో గుర్తులు..
నారు పోసే సమయంలో గింజలు మట్టిలో వేసిన తర్వాత కట్టెను పాతి దానిపై ఓ గుర్తు(అంకెలు) పెట్టుకుంటారు. నారు పెరిగిన తర్వాత ఏరకమో తెలుసుకునేందుకు ఇలా చేస్తుంటారు. కొన్ని రకాల గింజలు నల్లగా.. మరికొన్ని రకాల గింజలు తెల్లగా.. ఇంకొన్ని గోధుమ రంగులోనూ ఉంటాయి. ఆయా రకాల గింజలు దొడ్డుగా ఉంటున్నాయా..? సన్నగా ఉంటున్నాయా..? మధ్యస్థంగా ఉంటున్నాయా..? అనే విషయాలు తెలుసుకుంటారు. శాస్త్రవేత్తలు రోజువారీ డైరీలో భాగంగా ప్రతి విత్తనం లక్షణాలను రాసుకుంటారు. పంట కోత కోసిన తర్వాత ఏ రకం గింజలను ఆ రకం ప్యాకెట్లలో భద్రపరుస్తారు. అవి మూల విత్తనంగా పనిచేస్తాయని వరి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వివిధ రకాల పరిశోధనల అనంతరం అన్ని తెగుళ్లు, పురుగులను తట్టుకునే విత్తనాలను తయారు చేస్తారు.
వరి రకాలపై శాస్త్రవేత్తల పరిశోధనలు
పకడ్బందీగా విత్తనాల రూపకల్పన
విత్తనాల రూపకల్పనకు కేరాఫ్ పొలాస
వరి రకాల రూపకల్పనకు కేరాఫ్‌గా పొలాస పరిశోధన స్థానం నిలుస్తోంది. ఇక్కడ అన్ని రకాల విత్తనాలను పరిశీలించిన తర్వా త ఏ రకం విత్తనాన్ని మరే రకం విత్తనంతో సంకరీకరణం చేస్తే అధిక దిగుబడినిచ్చే కొత్త రకం విత్తనం వస్తుందో చూస్తాం.
– హరీశ్‌కుమార్ శర్మ, పరిశోధన స్థానం డైరెక్టర్
ఎలాంటి రకమో తెలుసుకునేందుకు
దేశవ్యాప్తంగా అన్ని రకాల విత్తనాలు సేకరించి ముందుగా పరిశోధన స్థానంలో నాటుతాం. ఒక పంటకాలంపాటు పరీక్షిస్తాం. ఆ రకం విత్తనాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తాం. మన వాతావరణాన్ని ఆయా రాష్ట్రాల విత్తనాలు ఎలా తట్టుకుంటున్నాయనే విషయాలు కూడా తెలుసుకుంటాం.
– శ్రీనివాస్, వరి శాస్త్రవేత్త, పొలాస

పరిశోధనలు కేరాఫ్ పొలాస

పరిశోధనలు కేరాఫ్ పొలాస

పరిశోధనలు కేరాఫ్ పొలాస