చైనా దుందుడుకు వైఖరి: అమెరికా కీలక వ్యాఖ్యలు

US Says Will Stand With Friends Amid India Ladakh Row With China - Sakshi

వాషింగ్టన్‌: పొరుగు దేశాలతో చైనా వ్యవహరిస్తున్న తీరుపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో మిత్ర దేశాలకు ఎల్లప్పుడూ తమ మద్దతు ఉంటుందని, అన్ని రకాలుగా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చింది. అదే విధంగా..  భారత్‌- చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, ప్రతిష్టంభనకు శాంతియుత పరిష్కారం కనుగొనాలని ఇరు దేశాలకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. డ్రాగన్‌ దేశ వ్యవహారశైలి పట్ల తమ వైఖరిని తెలియజేశారు.

‘‘ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో పొరుగు దేశాలతో చైనా బెదిరింపు ధోరణి ఆందోళన కలిగిస్తోంది. మా స్నేహితులకు ఎల్లప్పుడూ మేం అండగానే ఉంటాం. మా భాగస్వాములతో కలిసి పనిచేస్తాం. భద్రతాపరమైన విషయాల్లో పరస్పర సమాచార మార్పిడితో మిత్ర దేశాలకు సహకారం అందిస్తాం. ఇక భారత్‌- చైనా సరిహద్దులో నెలకొన్న వివాదాలను మేం నిశితంగా పరిశీలిస్తున్నాం. చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని మేం ఆశిస్తున్నాం’’ అని నెస్‌ ప్రైడ్‌ పేర్కొన్నారు. ఇక అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌, భారత విదేశీ వ్యవహారా మంత్రి ఎస్‌ జైశంకర్‌ మధ్య జరిగిన సంభాషణ గురించి స్పందిస్తూ.. అమెరికా- భారత్‌ మధ్య దౌత్య సంబంధాలు మరింత బలపడేలా చర్యలు తీసుకుంటున్నామని నైస్‌ ప్రైడ్‌ తెలిపారు.

అత్యున్నతస్థాయి చర్చల ద్వారా వివిధ అంశాల్లో ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించేలా సానుకూల వాతావరణ నెలకొంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా గతేడాది జూన్‌లో తూర్పు లదాఖ్‌లోని గల్వాన్‌లోయలో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఆర్మీ చొరబాటుకు ప్రయత్నించగా భారత్‌ దీటుగా బదులిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఆనాటి నుంచి ఎల్‌ఓసీ వెంబడి ఇరు దేశాలు భారీగా సైన్యాన్ని మోహరించగా, బలగాల ఉపసంహరణకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయి. కాగా ఇండో పసిఫిక్‌ ప్రాంతం, దక్షిణ సముద్ర జలాల్లో చైనా ఆధిపత్యానికి చెక్‌ పెట్టేలా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగం చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఇక కొత్తగా కొలువుదీరిన బైడెన్‌ ప్రభుత్వం కూడా చైనా తీరుపై ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. 

చదవండి: చైనా యాప్స్‌కు చెక్

చదవండి: అమెరికా ఈజ్‌ బ్యాక్‌: జో బైడెన్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top